
కలెక్టర్ లక్ష్మీశ
టూరిజం హబ్‌గా
తీర్చిదిద్దుదాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుదామని కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు. జిల్లాలో అత్యంత ప్రాచుర్యం పొందిన కొండపల్లి ఖిల్లా, భవానీ ద్వీపం, గాంధీ హిల్, బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం, మొగల్రాజపురం గుహలు, మూలపాడు బటర్‌ఫ్లై పార్కు వంటి పర్యాటక ప్రాంతాలతో పాటు కనకదుర్గమ్మ దేవాలయం, గుణదల మేరీమాత, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం, వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, జగ్గయ్యపేట సమీపంలోని తిరుమలగిరి వెంకటేశ్వరస్వామి ఆలయం వంటి పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయన్నారు. వీటితో పర్యాటకులను ఆకర్షించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్‌ను శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక, సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను పర్యాటకులు సందర్శించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి తేవడానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. భవానీ ద్వీపంలో వారాంతాల్లో వినోద, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ వర్గాల్లో ప్రతిభను వెలికితీసే పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. పర్యాటక శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యాచరణను రూపొందించి ముందడుగు వేయాలని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప పాల్గొన్నారు.