
ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటైంది. విజయవాడ ఎంజీ రోడ్డులోని లెమన్ ట్రీ హోటల్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో ఉత్సవ సమితిని ఏర్పాటు చేశారు. సమితికి గౌరవ అధ్యక్షుడిగా గోకరాజు గంగరాజు, అధ్యక్షుడిగా చలసాని ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా త్రినాథ్‌ను నియమించారు. వీరితో పాటు అన్ని జిల్లాల నుంచి సమితి సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా గౌరవా ధ్యక్షుడు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీ నుంచి జరిగే గణపతి నవరాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ విభాగాల నుంచి సహకారం అందించాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో పద్ధతిలో మండపాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ.. గణపతి నవరాత్రుల కోసం మండపాలు ఏర్పాటు చేసుకునేవారికి స్థానిక పరిపాలన వ్యవస్థ పోలీసు, విద్యుత్, వైద్య, ట్రాఫిక్, నీటిపారుదల శాఖ నుంచి సహాయ, సహకారాలు అందించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి త్రినాథ్ మాట్లాడుతూ.. ‘గణేష్ విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు, అనుమతుల కోసం రకరకాల రుసుముల పేరుతో ఇబ్బంది పెట్టకుండా చూడాలన్నారు. ఉత్సవ సమితికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. అనంతరం ఉత్సవాల వాల్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.