
సందేశాత్మకంగా సాంఘిక నాటికలు
విజయవాడ కల్చరల్: పీఎమ్‌కే ఫైన్ ఆర్ట్స్, ఏపీ చలన చిత్ర వాణిజ్యమండలి ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని కందుకూరి కల్యాణమండపంలో ఐదురోజులపాటు నిర్వహించే 44వ జాతీయ సాంఘిక నాటికల పోటీలు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. తొలి నాటికగా ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు వారు ప్రదర్శించిన మరీ అంతొద్దు నాటిక సందేశాత్మకంగా సాగింది. రచన ఆకురాతి భాస్కర్ చంద్ర, దర్శకత్వం నడింపిల్లి వెంకటేశ్వరరావు. రెండవ నాటికగా చెరుకురు సాంబశివరావు రచించి, దర్శకత్వం వహించిన విముక్తి నాటికను, మూడో నాటికగా ద్వార బంధాల చంద్రయ్య నాయుడు నాటికను ప్రదర్శించారు. కార్యక్రమాలను కళాపోషకుడు డోగిపర్తి శంకరరావు ప్రారంభించారు. నాటక రంగానికి పూర్వవైభవం తీసుకురావాలని సూచించారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పీఎమ్‌కే ఫైన్ ఆర్ట్స్ వ్యవస్థాపకుడు పసుపులేటి వెంకటరమణ పాల్గొన్నారు. రంగస్థల సినీ నటుడు కొప్పుల ఆనంద్ నిర్వహించారు.