రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని రక్షించాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని రక్షించాలి

Jan 11 2026 9:48 AM | Updated on Jan 11 2026 9:48 AM

రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని రక్షించాలి

రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని రక్షించాలి

● ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి ● విజయవాడ ధర్నాచౌక్‌లో హిందూ పరిరక్షణ సమితి నిరసన

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని రక్షించాలని, అన్ని హిందూ ఆలయాలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కోరారు. చంద్ర బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలు, దేవతామూర్తులు, భక్తులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం హిందూ ద్రోహిగా ముద్ర వేసుకుందని ధ్వజమెత్తారు. విజయవాడ ధర్నా చౌక్‌లో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హిందూ ఆలయాలు, ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో దయానంద దత్త స్వామి, జ్యోతి స్వరూపానంద స్వామిజీ పాల్గొని శివలింగానికి సంప్రోక్షణ చేశారు. ఆస్థిర పాలన పోవాలని, సుస్థిర పాలన రావాలని వేదపండితులు ఈశ్వరుడిని వేడుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి నాడు ద్రాక్షారామంలో కపాలేశ్వరస్వామి శివలింగాన్ని టీడీపీ నేత సోదరుడు ధ్వంసం చేశా రని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి గుడిలో తొమ్మిది మంది చనిపోతే అది ప్రైవేట్‌ ఆలయమని, ప్రభుత్వానికి సంబంధం లేదని పాలకులు తప్పించుకున్నారని విమర్శించారు. సింహాచలంలో నాణ్యత లేకుండా నిర్మించిన గోడ కూలి చందనోత్సవం రోజు భక్తులు మృతి చెందడానికి ప్రభుత్వం కారణం కాదా అని ప్రశ్నించారు. కాశీ నాయన క్షేత్రంలో అన్నదాన క్షేత్రం, భక్తుల నివాసాలను అటవీ భూమని చెప్పి ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చేసిందన్నారు. సనాతన ధర్మం అంటూ కాషాయం వేసుకుని అవసరానికి అవతారాలు ఎత్తే డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తన అటవీశాఖలో జరిగిన ఆ దారుణంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ హయాంలో హిందూ ఆలయాలు పరిరక్షించబడ్డాయని గుర్తుచేశారు. దుర్గగుడిలో పాలలో పురుగులు వచ్చిన ఘటనపై విచారణ చేపట్టాలని, శివలింగం ధ్వంసం చేసిన వారిపై క్రిమి నల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం హిందూ ద్రోహి

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లా డుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం హిందూ ద్రోహిగా ముద్రవేసుకుందన్నారు. ఆలయాల పరిరక్షణ, భక్తుల ప్రాణాలు కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ముక్కోటి ఏకాదశి నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆరుగురు భక్తులు, సింహాచలంలో చందనోత్సవంలో ఆరుగురు భక్తులను పొట్టనబెట్టుకుందన్నారు. గోవిందరాజుల గోపురంపై తాగుబోతు వీరంగం వేశాడని, తిరుమలలో మద్యపానం, మాంసాహారం, ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేయడం ఇలా.. రోజుకో ఆపచారం జరుగుతోందన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టనబెట్టుకున్నాడని, కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 45 ఆలయాలను ధ్వంసం చేయించాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే హిందూ సంఘాలు, స్వామీజీలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గతంలో అపచారం జరగకపోయినా పవన్‌ కల్యాణ్‌ దీక్ష పట్టి ఊగిపోయారని, ఇప్పుడెందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో హిందూ ధర్మాన్ని కాపాడేందుకు, భక్తుల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ మేయర్‌ అవుతు శ్రీశైలజారెడ్డి, రవిచంద్ర, కార్పొరేటర్లు మల్లేశ్వరి, శర్వాణి మూర్తి, యర్రగొర్ల తిరుపతమ్మ, నాయకులు ఉద్దంటి సురేష్‌, కుక్కల రమేష్‌, సుందర్‌ పాల్‌, పులప కృష్ణ, చల్ల సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement