సామాజిక పోరాట సాధనం.. నాటకం
హాస్యం జీవితంలో భాగం కావాలి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): నాటకం సామాజిక పోరాట సాధనమని నాటక రచయిత కందిమళ్ల సాంబశివరావు పేర్కొన్నారు. తెలుగు నాటకరంగం పూర్వ వైభవం సంతరించుకోవాలంటే ప్రపంచ సాహిత్యాన్నీ, నాటకరంగ పోకడలను అధ్యయనం చేయాలని నాటక పరిషత్తుల నిర్వాహకులకు సూచించారు. 36వ విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా ‘పాతికేళ్ల నాటకరంగం’పై శనివారం జరిగిన సదస్సులో ప్రధాన వక్తగా కందిమళ్ల సాంబశివరావు మాట్లాడుతూ.. యువ తరానికి నాటకరంగ మౌలిక స్వరూప స్వభావాలు, విశిష్టత తెలిసేలా ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వానికి, నాటకరంగ ప్రియులకు విజ్ఞప్తి చేశారు. సభకు అధ్యక్షత వహించిన నాటక పరిషత్ నిర్వాహకుడు అప్పాజోశ్యుల సత్యనారాయణ మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ తరఫున సాహితీకారులకు జీవన సాఫల్యపురస్కారాలు అందజేస్తున్నామని తెలిపారు. శ్రావ్యకావ్యానికీ, దృశ్యకావ్యానికీ మధ్యగల తేడాను పట్టుకున్న రచయితలు మాత్రమే మంచి నాటకాలను రాయగలరన్నారు. వీధి నాటక కళాకారుడు కె.శాంతారావు మాట్లా డుతూ.. ప్రపంచీకరణ ప్రమాదాలను తొలిగా ప్రజ ల్లోకి తీసుకెళ్లిన ఘనత తెలుగులో వీధి నాటకాలదేనని అన్నారు. నాటకకర్త వల్లూరి శివప్రసాద్ పుస్తక మహోత్సవసంఘం తరఫున కార్యక్రమానికి స్వాగతం పలికారు.
జనవిజ్ఞాన వేదిక పుస్తకాల ఆవిష్కరణ
బీవీ పట్టాభిరామ్ సాహిత్య వేదికపై మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన జనవిజ్ఞాన వేదిక పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది. ‘దాచేస్తే దాగని సత్యం – జీవపరిణామం’ పుస్తకాన్ని దేవరాజు మహారాజు, ‘మానవతామూర్తి మేడమ్ క్యూరీ’ పుస్తకాన్ని సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి శ్రీనివాసరావు, ‘బాలల కోసం భారత రాజ్యాంగ ప్రవేశిక’ పుస్తకాన్ని రాచర్ల శివ ఆవిష్కరించారు.
సామాజిక పరిణామాలకు దర్పణం చలపాక కవిత్వం
రచయిత చలపాక ప్రకాష్ తన కవితలలో వివిధ సామాజిక పరిణామాలకు, వాటికి నలిగిపోతున్న సామాన్యుల జీవనాలకు దర్పణం పట్టారని వక్తలు పేర్కొన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా చలపాక ప్రకాష్ కవితాసంపుటి ‘కవిత్వం రాసే చేతులు’ను బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి కె.లక్ష్మయ్య ఆవిష్కరించారు. సాహితీవేత్తలు డాక్టర్ గుమ్మా సాంబశివరావు, నానా, వెన్నా వల్లభరావు, మౌనశ్రీ మల్లిక్, వశిష్ట సోమేపల్లి, డాక్టర్ చుండూరు మాణిక్యాలరావు తదితరులు ప్రసంగించారు.
నాటక రచయిత కందిమళ్ల సాంబశివరావు
ప్రతి ఒక్కరి జీవితంలో హాస్యం భాగం కావాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అన్నారు. పుస్తక మహోత్సవంలో నిర్వహించిన నవ్వుల విందు కార్యక్రమం శ్రోతలకు వీనులవిందు చేసింది. పోలవరం సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం పూర్వ సంచాలకులు ముంజులూరి కృష్ణకుమారి, పారిశ్రామికవేత్త మాజేటి సురేంద్రనాథ్, రచయిత్రి రవి కృష్ణకుమారి, రచయిత్రి వాడవల్లి కృష్ణకుమారి శ్రోతలను నవ్వించారు. సాహితీ సంస్థ బాధ్యుడు గోళ్ల నారాయణరావు వందన సమర్పణ చేశారు.
సామాజిక పోరాట సాధనం.. నాటకం


