నిధుల సిద్ధి.. సమగ్రాభివృద్ధి | Sakshi
Sakshi News home page

నిధుల సిద్ధి.. సమగ్రాభివృద్ధి

Published Thu, Nov 16 2023 1:48 AM

ఎ. కొండూరు మండలం గొల్లమందలలో 
నిర్మించిన సీసీ రహదారి  - Sakshi

సాక్షి ప్రతినిధి విజయవాడ: ప్రతి ఇంటికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను చేర్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ కార్యక్రమం జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. ప్రజా ప్రతినిధులు ప్రతి గడపకు వెళ్లి నాలుగున్నరేళ్లలో ప్రతి కుటుంబం పొందిన సంక్షేమ లబ్ధిని వివరిస్తున్నారు. విజయవాడ వెస్ట్‌, తిరువూరు నియోజకవర్గాల్లో కార్యక్రమం మొత్తం పూర్తయ్యింది. విజయవాడ ఈస్ట్‌, సెంట్రల్‌ నియోజక వర్గాల్లో తుది దశకు చేరింది. మిగిలిన నియోజకవర్గాల్లో సైతం శరవేగంగా సాగుతోంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును తెలుసుకొనేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి ప్రజల వద్దకు వెళ్తున్నారు. కార్యక్రమంలో పథకాల అమలే కాకుండా సమస్యలను తెలుసుకుంటున్నారు. వాటి పరిష్కారం కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున విడుదల చేశారు. దానిలో భాగంగా క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన ప్రతిపాదిత పనులకు కలెక్టర్‌ వెంటనే మంజూరు చేస్తున్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఇతర ప్రజా ప్రతినిధులు సచివాలయ సిబ్బంది ప్రాధాన్యతా ప్రకారం పనులు గుర్తిస్తున్నారు. వాటిని మంజూరు చేసి, పనులు ప్రారంభించి, త్వరితగతిన పనులు పూర్తయ్యేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

430 సచివాలయాల్లో పూర్తి..

ఎన్టీఆర్‌ జిల్లాలో 605 సచివాలయాల పరిధిలో 430 సచివాలయాల్లో పూర్తిగా గడప గడప కార్యక్రమం పూర్తయ్యింది. ఇంకా కొన్ని సచివాలయాల్లో గడప గడప కార్యక్రమం పూర్తయినప్పటికీ ప్రజా ప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు జిల్లా కేంద్రానికి చేరలేదు. అయితే ఇప్పటికే దాదాపు రూ.78.64కోట్లకు పైగా విలువైన 1,196 పనులు మంజూరయ్యాయి. వీటిలో 878 పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఇందులో తాగునీటి వసతి, సీసీరోడ్డు, డ్రెయినేజీ కాలువల నిర్మాణం, కొత్త విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, కల్వర్టులు, కమ్యూనిటీ భవనాలు, ప్రహరీ నిర్మాణాలకు ప్రాధాన్యతా క్రమంలో నిధులు మంజూరు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలో కలెక్టర్‌ ఢిల్లీరావు, స్వయంగా ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గడప గడపకు కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమ అమలు తీరు, ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిశీలించారు.

పల్లెలో ప్రగతి వెన్నెల..

పల్లెలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. ముఖ్యంగా నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వాస్పత్రులు అభివృద్ధికి నోచుకున్నాయి. ప్రజల ముంగిటకే సేవలందించేందుకు ఏర్పాటైన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజీ హెల్త్‌ క్లినిక్‌లు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, డిజిటల్‌ లైబ్రరీలకు కొత్త భవనాలు సమకూరుతున్నాయి. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయాలతో గ్రామాలు కళకళలాడుతున్నాయి. జిల్లాలో 1,082 ప్రభుత్వ నిర్మాణాలకు శ్రీకారం చుట్టగా 60శాతానికి పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి.

‘గడప గడప’లో ప్రగతి ప్రకాశం

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా

‘గడప గడపకు మన ప్రభుత్వం’

విజయవాడ వెస్ట్‌, తిరువూరుల్లో

కార్యక్రమం పూర్తి

గుర్తించిన పనులు చకచకా నిర్వహణ

జిల్లా వ్యాప్తంగా రూ.78.64 కోట్ల

మేర పనులు మంజూరు

పల్లెల్లో కళ్లెదుటే కనిపిస్తున్న అభివృద్ధి

ఎన్టీఆర్‌ జిల్లాలో ఇదీ పరిస్థితి..

నియోజకవర్గం గడప గడప మంజూరైన ప్రారంభమైనవి పూర్తయిన పనులు

సచివాలయాలు

జగ్గయ్యపేట 29 159 102

తిరువూరు 77 341 277

నందిగామ 31 151 97

మైలవరం 23 164 85

విజయవాడ వెస్ట్‌ 90 176 145

విజయవాడ సెంట్రల్‌ 80 81 72

విజయవాడ ఈస్ట్‌ 95 124 100

గన్నవరం 05 – –

(విజయవాడ రూరల్‌)

మొత్తం 430 1,196 878

పనులకు ప్రాధాన్యం..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం పనులపై ప్రత్యేక దృష్టి సారించాం. క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన ప్రతిపాదనలకు వెంటనే నిధులు మంజూరు చేస్తున్నాం. ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపడుతున్నాం. ఇప్పటికే విజయవాడ కార్పొరేషన్‌ పాటు, గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బిల్లుల మంజూరులో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. పనుల పురోగతిపై వారం వారం సమీక్షిస్తూ, అధికారులకు లక్ష్యాలను నిర్ధేశిస్తున్నాం.

– ఢిల్లీరావు, కలెక్టర్‌, ఎన్టీఆర్‌ జిల్లా

1/1

Advertisement
 

తప్పక చదవండి

Advertisement