98.91 శాతం హాజరు నమోదు
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ హిందీ, ఏపీఓఎస్‌ఎస్ ఇంగ్లిష్ పబ్లిక్ పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా జరిగినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. పామర్రులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు 21,312 మంది విద్యార్థులకు గాను 21,079 మంది హాజరవగా, 98.91 శాతం, ఏపీఓఎస్‌ఎస్‌లో 598 మందికి గాను 437 మంది హాజరవడంతో 73.08 శాతం హాజరు నమోదైందన్నారు.
రెగ్యులర్, వన్స్ ఫెయిల్ విద్యార్థులు..
రెగ్యులర్ ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు 21,257 మందికి గాను 21,063 మంది హాజరై 99.09 శాతం హాజరు నమోదైందని డీఈఓ తెలిపారు. ఒకసారి ఫెయిల్ అయిన ప్రైవేట్ అభ్యర్థుల్లో 55 మందికి గాను 16 మంది హాజరై 29.09 శాతం హాజరు నమోదవగా, 39 మంది గైర్హాజరయ్యారు. ఏపీఓఎస్‌ఎస్‌లో 598 మందికి గాను 437 మంది హాజరై 73.08 శాతం హాజరు నమోదవగా, 161 మంది గైర్హాజరయ్యారు. పలు కేంద్రాలను పరిశీలించి, సిబ్బంది తగు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలందరికీ ఇఫ్తార్ విందు అందివ్వడం ద్వారా మత సామరస్యాన్ని చాటి చెప్పినట్లు అవుతుందని ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు అన్నారు. పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ముస్లిం సోదరులకు బుధవారం సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత వున్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ’రోజా’(ఉపవాస దీక్షలు), దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుందన్నారు. ముస్లిం సోదరులు పోలీస్ శాఖలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, అలాగే ఇతర శాఖల్లో కూడా వారి సేవలు ప్రశంసనీయమన్నారు. డీసీపీలు తిరుమలేశ్వరరెడ్డి, షరీన్‌బేగం, కేజీవీ సరిత, కె. కృష్ణ ప్రసన్న, ఏబీటీఎస్ ఉదయరాణి, బి. లక్ష్మీనారాయణ, ఎస్‌వీడీ ప్రసాద్, ముస్లిం మత పెద్దలు పాల్గొనారు.


