జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

Mar 19 2026 7:31 AM | Updated on Mar 19 2026 7:31 AM

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు 24న వెటరన్స్‌ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ముగిసిన వ్యవసాయ కార్మిక సంఘం మహా సభలు కానూరులో బాలిక అనుమానాస్పద మృతి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): శ్రీ పరాభవ నామ సంవత్సరం జిల్లా ప్రజల జీవితాల్లో కొత్త విజయాలు, వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ కలెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీశ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజల సంస్కృతిలో ఉగాది పండుగకు విశిష్ట స్థానం ఉందని, ఇది కేవలం కొత్త సంవత్సర ఆరంభం మాత్రమే కాకుండా ఆలోచనలు, ఆశయాలను పునర్నించుకునే ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం ఆవరణలో ఈ నెల 24వ తేదీన మాస్టర్స్‌ (వెటరన్స్‌) జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్‌ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. రన్నింగ్‌, జావెలిన్‌త్రో, లాంగ్‌ జంప్‌, షాట్‌ పుట్‌, డిస్కస్‌త్రో, హైజంప్‌ల్లో మహిళ లు, పురుషులకు పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు స్పోర్ట్స్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఆధార్‌ నంబర్‌ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటలకు బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం ఆవరణలో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలైన వారు ఈ నెల 30, 31వ తేదీల్లో గుంటూ రు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో జరిగే రాష్ట స్థాయి పోటీల్లో పాల్గొంటారని, వివరాలకు 98661 34016లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.

ఎ.కొండూరు: మండలం పరిధిలోని చీమలపాడు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన 33వ జిల్లా మహాసభలు బుధవారం ముగిశాయి. రెండు రోజులపాటు సాగిన ఈ సమావేశాల్లో గత మూడేళ్లుగా చేసిన పోరాటాలు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై సమీక్ష చేశారు. పలు కీలక నిర్ణయాలు, డిమాండ్లను ప్రస్తావించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి, పాత చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, జగనన్న కాలనీల్లో ఉన్న ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని విన్నవించారు. అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని తీర్మానించారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణ కోసం నూతన కమిటీని ఎన్నుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పానెం ఆనందరావు, రైతులు పాల్గొన్నారు.

పెనమలూరు: కానూరులో ఇంటర్‌ చదువుతున్న బాలిక బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు నాగార్జున ఆస్పత్రి సమీపంలో యశ్విని(16) కుటుంబ సభ్యులతో ఉంటుంది. ఆమె విజయవాడ మోగల్రాజపురంలో ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ చదువుతూ మొదటి ఏడాది ఎంఈసీ పరీక్ష రాసింది. అయితే ఆమె ఇంట్లో ఉదయం చున్నీతో ఉరేసుకొని మృతి చెందింది. చదువుల ఒత్తిడి కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement