
పెనమలూరు: ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ చదువుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యనమలకుదురుకు చెందిన అయోధ్య జయసూర్య (23) మృతదేహం ఎట్టకేలకు శుక్రవారం యనమలకుదురుకు చేరుకుంది. గత నెల 20వ తేదీన ఫిలిప్పీన్స్‌లో బైక్‌పై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన జయసూర్య మృతదేహం యనమలకుదురుకు తీసుకురావడానికి సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తాయి.
దీంతో మృతుడి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ప్రభుత్వ అధికారుల కృషితో జయసూర్య మృతదేహం కార్గో విమానంలో హైదరాబాద్‌కు వచ్చింది. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో యనమలకుదురుకు మృతదేహాన్ని తీసుకు వచ్చారు.
నాలుగు నెలల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటికి రావల్సిన జయసూర్య విగతజీవిగా ఇంటికి రావటంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వైఎస్సార్ సీపీ నేతలు, గ్రామస్తులు జయసూర్య మృతదేహానికి నివాళు లర్పించారు. శనివారం యనమలకుదురులో జయసూర్య అంత్యక్రియలు జరగనున్నాయి.