విరాళాల సేకరణలో తానా సరికొత్త రికార్డు

Tana Sets New Record In Collections Donations - Sakshi

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) 23వ మహాసభల సన్నాహక కార్యక్రమ విందులో పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు పాల్గొని చారిత్రాత్మక స్థాయిలో విరాళాలు ప్రకటించారు. తానా 45 సంవత్సరాల చరిత్రలో మహాసభల విరాళాల సేకరణలో సరికొత్త రికార్డు సృష్టించింది. కోవిడ్ మహమ్మారి తీవ్రతతో 2021లో నిర్వహించాల్సిన మహాసభలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. 

దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఫిలడెల్ఫియా నగరంలో 2023 జులై 7 నుండి 9 వరకు జరగబోతున్న తానా మహాసభల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా శనివారం నవంబర్ 5నాడు పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వార్మిన్స్టర్ నగరంలోని ఫ్యూజ్ బ్యాంక్వెట్ హాల్లో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమానికి అంచనాలకి మించిన స్పందన లభించింది. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కన్వీనర్ పొట్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన విరాళాల సేకరణ విందులో ఎనిమిది వందల మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు. 

గతంలో జరిగిన అన్ని విరాళాల సేకరణని మించిపోయేలా దాదాపు నలభై ఎనిమిది కోట్ల రూపాయల (ఆరు మిలియన్ల డాలర్లు) విరాళాలు ప్రకటించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి హాజరైన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, EC, BOD, ఫౌండేషన్ సభ్యులను, మాజీ అధ్యక్షులను, ఇతర కమిటీ సభ్యులను పరిచయం చేసి సమాజానికి వారు చేసిన సేవలను కొనియాడారు. తానా సభ్యులు, వాలంటీర్లు, దాతలు సంఘం అభివృద్ధికి వారు చేసిన కృషిని సమాజానికి చేసిన సేవలను ఈ సందర్భంగా అభినందించారు. 23వ తానా మహాసభల ప్రాముఖ్యతను చాలా వివరంగా వివరించారు.


ప్రతిష్టాత్మక తానా మహాసభలు దాదాపు నాలుగేళ్ళ తర్వాత నిర్వహిస్తుండటంతో పాటు అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు నేతృత్వంలోని తానా కార్యవర్గం గత పదహారు నెలలుగా చేసిన సేవలు, చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాలు ప్రవాస భారతీయుల్లో 23వ తానా మహాసభల పట్ల ఆసక్తిని పెంచి విరాళాల సేకరణ కార్యక్రమానికి ఊహించని స్పందన లభించినట్లు మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తెలిపారు. విరాళాల కార్యక్రమ నిర్వహణకు సహకరించిన పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్, డెక్కన్ స్పైస్ గోవర్ధన్ బోబ్బా, జగదీశ్ యలమంచిలి, వాలంటీర్లకు కృతఙ్ఞతలు తెలియజేశారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top