విశేషంగా అలరించిన వద్దిపర్తి పద్మాకర్‌ అష్టావధానం | Sankranthi Celebrations Vaddiparti Padmakar Ashtavadhanam Singapore | Sakshi
Sakshi News home page

విశేషంగా అలరించిన వద్దిపర్తి పద్మాకర్‌ అష్టావధానం

Jan 16 2022 4:59 PM | Updated on Jan 16 2022 4:59 PM

Sankranthi Celebrations Vaddiparti Padmakar Ashtavadhanam Singapore - Sakshi

"శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకల ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా తెలుగు సాహితీ సంస్కృతికి తలమానికమైన అవధాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. సింగపూర్ వేదికపై బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అష్టావధానం నిర్వహింపబడడం ఇదే తొలిసారి కాగా, ఇది వారు చేసిన 1240 అవధానం కావడం మరొక విశేషం. 

"తెలుగువారికి గర్వకారణమైన అవధాన ప్రక్రియకు పట్టంకడుతూ అన్ని దేశాలవారితో కలసి నిర్వహిస్తున్న అష్టావధాన కార్యక్రమ పరంపరలో భాగంగా ఈ కార్యక్రమాన్ని సింగపూరు తెలుగువారికి సంక్రాంతి కానుకగా అందించడానికి ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమాల్లో పృచ్ఛకులుగా సింగపూర్ నుంచి తమ సంస్థ సభ్యులే పాల్గొనడం మరింత ఆనందంగా ఉందని" సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. గౌరవ అతిథులుగా రాష్ట్ర శాసనసభ పూర్వ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా‌ అధ్యక్షులు, డా. వంగూరి చిట్టెన్ రాజు, సంచాలకులుగా ఆస్ట్రేలియా నుండి అవధాన శారదామూర్తి, తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని సభకు మరింత శోభను చేకూర్చారు. 

చక్కటి చలోక్తులతో ఆసాంతం ఆసక్తికరంగా కొనసాగిన ఈ అవధానంలో "కృష్ణున్బొంది సుయోధనుండు మురిసెన్ గీతామృతాస్వాదియై" అనే శార్దూల వృత్తంలో సమస్యాపూరణం, దత్తపది అంశంలో "గురువు" అనే పదాన్ని నానార్థాలలో వాడుతూ చంపకమాల వృత్తం, ఆధునిక మహిళ విజయాలపై నిషిద్ధాక్షరి అంశం కొరకు కంద పద్యం, న్యస్తాక్షరి అంశం కొరకు "గాలిపటం" అనే పదంలోని అక్షరాలను వేర్వేరు పాదాలలో వచ్చేలా ఉత్పలమాల పద్యం, రాముని అందాన్ని చూసి మైమరచిన విశ్వామిత్రుని స్పందన వర్ణన అంశం పద్యం మొదలైన అధ్భుత పూరణలు అందరినీ అలరించాయి. 

పృచ్ఛకులుగా సమస్యాపూరణం - రాధిక మంగిపూడి; దత్తపది- రాధాకృష్ణ రేగళ్ల; నిషిద్ధాక్షరి -  అపర్ణ గాడేపల్లి; న్యస్తాక్షరి - రోజారమణి ఓరుగంటి; వర్ణన -  స్వాతి జంగా; ఆశువు - పాటూరి రాంబాబు; అప్రస్తుతం - శ్రీ రత్న కుమార్ కవుటూరు; పురాణపఠనం - శ్రీ రాజేంద్రబాబు గట్టు; పాల్గొని చక్కటి ప్రశ్నలతో సభను రక్తి కట్టించారు. సంస్థ కార్యవర్గ సభ్యులు చామిరాజు రామాంజనేయులు సభానిర్వహణ గావించగా భాస్కర్ ఊలపల్లి వందన సమర్పణ చేశారు, ధరణీప్రగడ వెంకటేశ్వరరావు, రమాసత్యవతి దంపతులు "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ ప్రతినిధులుగా పద్మాకర్ గురుదేవులను సత్కరించారు. గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక నిర్వహణలో యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచ నలుమూలల నుండి వేలాదిమంది తెలుగు సాహితీప్రియులు వీక్షించి హర్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement