సింగపూర్‌లో వైభవంగా సంగీత రాఘవధాన కార్యక్రమం..

Ragavadhanam Program At Singapore - Sakshi

సింగపూర్‌: సింగపూర్ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రోజు ఆన్‌లైన్‌లో ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ గరికపాటి వెంకట ప్రభాకర్‌ ‘రాగావధానం’కార్యక్రమం జరిగింది. ఇది సుమారు అయిదు గంటల పాటు కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని గరికిపాటి వెంకట ప్రభాకర్, శ్రీమతి పద్మ లలిత దంపతులు జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.  దీనికి అమెరికా నుండి చిట్టెన్ రాజు, భారతదేశం నుండి డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ గాయకులు శ్రీ జి ఆనంద్, ప్రఖ్యాత గాయని శ్రీమతి సురేఖ మూర్తి తదితరులు గౌరవ అతిథులుగా హజరయ్యారు. దీనిలో సాహిత్య అష్టావధానం కార్యక్రమం నిర్వహించారు.

దీనిలో విద్యాధరి, శేషుకుమారి, సౌభాగ్యలక్ష్మి, షర్మిల, పద్మావతి, స్నిగ్ధ, అనంత్ అనే ఏడుగురు గాయనీ గాయకులు ప్రశ్నలు వేసేవారిలా వ్యవహరించారు. రాధిక మంగిపూడి మాట్లాడుతున్నారు. ప్రశ్నలు అడిగిన పాటలకు అవధాని అప్పటికప్పుడు , అడిగిన రాగాన్ని మార్చాడం, అడిగిన తాళంలో మార్చి పాడటం, రాగమాలికలు, పద్యాలలోని అడిగిన స్వర స్థానాలలో పాడడం, కొన్ని పదాలను విడిచిపెట్టడం, మొత్తానికి ఆసక్తి కరంగా సాగింది.

కాగా, అమెరికా, హాంగ్ కాంగ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నార్వే మొదలగు దేశాల నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించారు. కార్యాక్రమ నిర్వాహకులు శ్రీ కవుటూరు రత్నకుమార్‌ మాట్లాడుతూ. జీవి ప్రభాకర్‌ గారు కార్యక్రమానికి సంపూర్ణ న్యాయం చేశారని అన్నారు. ఎలాంటి ప్రశ్నలు వేసిన హుందాగా సమాధానం చెప్పారని తెలిపారు. ఇది మొదటి నుంచి ఎంతో వినోదాత్మాకంగా కొనసాగింది. కేవలం అయిదు గంటల్లోనే 2500 మందికిపైగా ప్రజలు  ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ద్వారా చూశారని తెలియజేశారు.

మొదటి రెండు ఆవృతాలలో త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య సంకీర్తనలతోపాటు సినిమా పాటలు, జానపదాలు, లలిత సంగీతం, దేశభక్తి గీతాలు, పద్యాలు మొదలైన వైవిధ్యభరితమైన అంశాలలో పాటలను ఎంచుకుని ప్రశ్నించేవారు వేరువేరు రాగ తాళాలలో ప్రశ్నలు కురిపించారు. మూడవ ఆవృతంలో రాగ వ్యూహం మరియు తాళ వ్యూహం అనే  ప్రక్రియతో అవధాని పాడుతున్న  ఒకే పాటకు అందరూ అప్పటికప్పుడు ఒక్కసారిగా వివిధ రాగాలలో తాళాలలో పాడమని  ప్రశ్నలు సంధించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అలాగే అతిథిగా విచ్చేసిన సురేఖ మూర్తి అప్పటికప్పుడు ఒక కొత్త పాటను ఇచ్చి చంద్రకౌంసు రాగంలో స్వర పరచమని అడుగగా అవధాని వెంటనే ఆ పాటను ఆ రాగంలో స్వరకల్పన చేసి వినిపించారు. శ్రీ జీవి ప్రభాకర్ మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమం చేయగలగడం తనకు ఎంతో ఆనందంగా అనిపించిందని ఎన్నో విలక్షణమైన ప్రశ్నలకు తాను తృప్తికరంగా సమాధానాలు ఇవ్వగలిగానని పలికి 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' వారికి, అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమానికి రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. ఈ రిమిట్‌, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్, జ్యూస్ వారు ఆర్థిక సహాయం అందించారు. అమెరికాలోని యూఎస్ టెలివిజన్ వన్ ఛానల్ వారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. కాగా, దీనికి ఈక్షణం,  సింగపూర్ తెలుగు టీవి వారు మీడియా పార్టనర్ గా సహకారం అందించారు .
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top