మన సం‍ప్రదాయాలకు వాల్మీకీ రామాయణం ఆదర్శం

NRI News About Valmiki Ramayana Sandesham Programme In Indonesia - Sakshi

సింగపూర్‌ : మన సంస్కృతీ, సాంప్రదాయాలకు వాల్మీకి రామాయణం ఆదర్శమని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. టీటీడీ పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాల, సింగపూర్ తెలుగు సమాజం సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి సందర్భంగా ‘వాల్మీకి రామాయణ సందేశం‘ అంతర్జాతీయ అంతర్జాల సదస్సు నిర్వహించారు. ఉపన్యాసకులుగా ఇండోనేషియా నుంచి రామాయణ హరినాథ్ రెడ్డి వ్యవహరించారు. ముఖ్య అతిథిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక శ్రీ పద్మావతి అతిథి గృహం వేదికగా అంతర్జాల సదస్సును అయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. రామాయణ సందేశం నేటి సమాజానికి ఆవశ్యకమని స్పష్టం చేశారు. భగవంతుడు స్వయంగా మానవునిగా  అవతరించారని, ఎలా జీవించాలనే చూపారని తెలిపారు. త్రేతాయుగం నాటి శ్రీ రామ చంద్రుడు కుటుంబ ధర్మం, పితృ వాక్ పరిపాలన, రాజ్య పాలన వంటివి గొప్పగా చేపట్టి చక్కటి సందేశాన్ని ఇచ్చారన్నారు. నేటి యువత తప్పక వాల్మీకి రామాయణం ద్వారా ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. శ్రీరాముని గుణగణాలను విద్యార్థులు అలవర్చుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహదేవమ్మ అన్నారు. 


సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి  మాట్లాడుతూ వాల్మీకి జయంతి నాడు ఆయన రాసిన రామాయణం వినడం పుణ్యఫలం అన్నారు. వాల్మీకి రామాయణ సందేశం ఉపన్యాసకులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ధర్మప్రవర్తనా పరుడైన శ్రీ రాముని చరిత్ర వింటేనే జన్మ తరిస్తుందన్నారు.

సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రామాయణ విశిష్టతను తెలియజేసేందుకు తాము చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని అన్నారు.

ఈ అంతర్జాతీయ అంతర్జాల సదస్సుకు దాదాపు 25 దేశాల నుంచి ప్రతినిధులు వెబినార్ కు హాజరయ్యారు. ఇందులో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, పిలిప్పైన్, ఇండోనేషియా, యుఎస్ఎ తదితర దేశాలు ఉన్నాయి. వేల సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఈ వెబినార్ లో పాల్గొన్న ప్రతినిధులకు టీటీడీ ఈ సర్టిఫికెట్ ను అందజేయనుంది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top