ఎన్నారై వార్త: తల్లిని చిదిమేసిన విమానం.. కూతురి పరిస్థితి విషమం

Indian Origin Woman Dead In Plane Crash Daughter Serious - Sakshi

న్యూజెర్సీ: న్యూయార్క్‌లో జరిగిన విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన మహిళ ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో ఆమె కూతురు, పైలట్‌ గాయాలతో బయటపడినప్పటికీ.. వాళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

రోమా గుప్తా(63), ఆమె తనయ రీవా గుప్తా(33)లు ఆదివారం ఓ తేలికపాటి ప్రదర్శన విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో కాక్‌పిట్‌ నుంచి పొగ రావడంతో పైలెట్‌ దానిని లాంగ్‌ ఐల్యాండ్‌ వద్ద క్రాష్‌ ల్యాండ్‌ చేశాడు. ఈ ఘటనలో విమానంలో మంటలు చెలరేగి రోమా అక్కడిక్కడే మృతి చెందగా.. కాలిన గాయాలతో రీవా, పైలెట్‌(23)లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్లిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

తూర్పు ఫార్మింగ్‌డేల్ రిపబ్లిక్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానం ముగ్గురితో టేకాఫ్‌ అయ్యింది. ప్రమాదానికి గురైన ఫోర్‌ సీటర్‌ విమానం టూరిస్ట్‌ ఫ్లైట్‌ అని, కేవలం ప్రదర్శన(డెమో) కోసమే ఉంచారని అధికారులు చెబుతున్నారు . అయితే న్యూజెర్సీకి చెందిన ఆ తల్లీకూతుళ్లు ఆ తేలికపాటి విమానాన్ని కొనుగోలు చేసినట్లు విమాన కంపెనీ తరపు న్యాయప్రతినిధులు చెప్తున్నారు.

మరోవైపు ప్రమాదానికి గల కారణాలను కనిపెట్టేందుకు ఒకవైపు ఎన్‌టీఎస్‌బీ(National Transportation Safety Board), మరోవైపు ఎఫ్‌ఏఏ(Federal Aviation Administration) దర్యాప్తు చేపట్టాయి. ఇప్పటికే మూడుసార్లు ప్రమాద స్థలానికి వెళ్లి.. శకలాలను పరిశీలించారు. ఇదిలా ఉంటే.. గుప్తా కుటుంబం కోసం GoFundMe ద్వారా ఇప్పటికే 60వేలకు పైగా డాలర్లను సేకరించారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top