Ukrainian: సారీ అమ్మా.. నేను భారత్‌కు రాలేను! దేశం కోసం నేహ తండ్రి బలయ్యాడు! అందుకే..

Haryana Girl Neha Stay With Ukrainian Family Melts Heart - Sakshi

ఉక్రెయిన్‌ యుద్ధ వాతావరణంతో అక్కడి పౌరులు సైతం ఆయుధాలు చేతబడ్డి కదనరంగంలోకి దూకారు. ఇక విదేశీ పౌరులేమో ప్రాణాల కోసం పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు భారత్‌కు క్షేమంగా చేరుకున్నారు. మరికొందరిని రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇంకొందరు బంకర్లలో(అండర్‌ గ్రౌండ్‌ల్లో) తలదాచుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఓ విద్యార్థిని చేసిన పని.. ఆమె కుటుంబంలో ఆందోళన కలిగిస్తుండగా.. మిగిలిన వాళ్లంతా శెభాష్‌ అని మెచ్చుకుంటున్నారు. 

Russia-Ukraine crisis: హర్యానాకు చెందిన నేహా .. మెడిసిన్‌ కోసం ఉక్రెయిన్‌ వెళ్లింది. కొన్నాళ్లు హాస్టల్‌లో ఉన్న ఆమె ఆ తర్వాత ఉక్రెయిన్‌కు చెందిన ఒక సివిల్‌ ఇంజనీర్‌ ఇంట్లో ఆశ్రయం పొందింది. ప్రస్తుత పరిస్థితుల్లో.. కావాలంటే ఆమె భారత్‌కు తిరిగి వచ్చేది. కానీ, ఆమె ఉంటున్న ఇంటి యజమాని యుద్ధం కోసం సైన్యంలో చేరాడు. ఈ పరిస్థితుల్లో ఆ ఇంటిని వీడేందుకు నేహ నిరాకరించింది. తనకు అన్నం పెట్టిన కుటుంబం ఆపదలో ఉంటే ఎలా రావాలంటూ.. అక్కడే ఉండిపోయింది.  అదే ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకోవడంలో ఆయన భార్యకు సాయం చేయాలని నిర్ణయించుకుంది. 17 ఏళ్ల నేహా ప్రస్తుతం సదరు ఇంజనీర్‌ భార్య, ఆయన ముగ్గురు పిల్లలతో కలిసి బంకర్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. 

నేహా కుటుంబం మాతృభూమి కోసం ఎంతో త్యాగం చేసింది. ఆమె తండ్రి ఇండియన్‌ ఆర్మీలో పనిచేసేవాళ్లు. కొన్నేళ్ల కిందట యుద్ధంలో ఆయన కన్నుమూశారు. అప్పటి నుంచి తల్లి బాధ్యతగా ముందుకెళ్తోంది. ఆమె ప్రస్తుతం హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాలో టీచర్‌గా పని చేస్తున్నారు. తన కూతురిని ఉక్రెయిన్ నుంచి రప్పించేందుకు నేహా తల్లి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ, నేహ మాత్రం ససేమిరా అంది. ‘నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు కానీ.. ఈ పిల్లలను వదిలి రాలేను. నాకు జన్మనిచ్చిన తండ్రి దేశం కోసం అమరుడయ్యాడు. తండ్రి లాంటి వ్యక్తి దేశం కోసం పోరాటంలో ఉన్నారు. అన్నం పెట్టిన ఈ అమ్మను ఇలాంటి పరిస్థితిలో వదిలిపెట్టలేను’ అంటూ తన తల్లితో చెప్పేసింది. ఈ విషయాన్ని నేహ కుటుంబానికి దగ్గరైన సవితా జాఖర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top