బర్క్‌షైర్ (యూకే): యునైటెడ్ కింగ్‌డమ్ రెడింగ్‌లోని రెడింగ్ జాతర టీమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు కుటుంబాల సమాగమంగా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమానికి వెయ్యికి పైగా మంది హాజరై, తెలంగాణ సంస్కృతిని ఘనంగా చాటారు.
పారంపర్య బతుకమ్మ పాటలతో మహిళలు బతుకమ్మలు ఆడగా, యువతులు, పిల్లలు ఉత్సాహంగా డాండియా ఆడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన దుర్గాపూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి. చిన్నారులు కట్టిపడేసేలా భరతనాట్యం ప్రదర్శించగా, తెలుగు వంటకాలతో సాంప్రదాయ విందు అందించారు. వేడుకల అనంతరం బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేయడంతో కార్యక్రమం ముగిసింది.

ఈ భవ్య కార్యక్రమాన్ని గత 11 ఏళ్లుగా నిరంతరంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు విశ్వేశ్వర్ మంథని, రంజిత్ నడిపల్లి, ప్రసాద్ అవధానుల, రమేశ్ జంగిలి, రఘు, చందు, రామ్‌రెడ్డి, రామ్‌ప్రసాద్, నాగార్జున మాట్లాడుతూ – “తెలంగాణ సంప్రదాయాలను తదుపరి తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం కొనసాగిస్తాం” అని తెలిపారు.
