ఏజెంట్ చేతిలో మోసపోయిన వలసకార్మికులు.. ఏపీ ప్రభు​త్వ సహకారంతో స్వదేశానికి రాక!

Apnrt Rescue Telugu Workers Cheated By Agents In Oman - Sakshi

ఒమాన్ లో ఏజెంట్ చేతిలో మోసపోయిన 08 మంది వలసకార్మికులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS సహకారంతో స్వదేశానికి రప్పించారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లాలనుకునే వారు రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్ల ద్వారా సక్రమ పద్ధతిలో వెళ్లాలని ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 08 మంది వలసదారులు అక్రమ ఏజెంట్ మాయమాటలు నమ్మి ఒమాన్ కు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వీరిని రాష్ట్రానికి తీసుకురావడానికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున APNRTS ఒమాన్ లోని భారత రాయబార కార్యాలయంతో ఇమెయిల్ ద్వారా పలుమార్లు సంప్రదించింది.

వసతి, ఆహార సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న వారిని భారతదేశం పంపాలని, అక్రమ ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని APNRTS కోరింది. ఎట్టకేలకు ఏపీఎన్‌ఆర్‌టీసీ ప్రయత్నాలు ఫలించడంతో ఈ నెల 27న వాళ్లు విజయవాడకు చేరుకున్నారు. అనంతరం ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రవాసాంధ్రుల అభివృద్ధి, భద్రత, సంక్షేమమే ధ్యేయంగా ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ నిరంతరం పనిచేస్తోందన్నారు.

స్వదేశానికి చేరుకున్న తర్వాత బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి ఏజెంట్ గా వ్యవహరిస్తూ ఒమాన్ లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఈ 08 మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వీసాలు ఏర్పాటు చేసి ఒమాన్ దేశం తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఏజెంట్ చెప్పిన ఉద్యోగాలు కల్పించకపోగా, సరైన వసతి, భోజనం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయంపై వారు సదరు ఏజెంట్ ని నిలదీయగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఉద్యోగాలు లేవు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని హెచ్చరించి, మమ్మల్ని రోడ్డున పడేశారని తెలిపారు. దిక్కుతోచని స్థితిలో భారతదేశానికి రావడానికి సహాయం కొరకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ, APNRTS ను సంప్రదించారు.

ఈ క్రమంలోనే పశుసంవర్ధక, మత్య్సశాఖాభివృద్ది మంత్రి డా. సీదిరి అప్పలరాజు వలసకార్మికుల క్షేమసమాచారాలు తెలుసుకోవాలని, త్వరితగతిన వారిని స్వదేశానికి రప్పించాలని APNRTS ను కోరారు. తక్షణమే స్పందించిన APNRTS బాధితుల నుంచి మరిన్ని వివరాలను సేకరించి, ఒమాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీకి వారి పరిస్థితిని వివరించారు. సదరు ఏజెంట్ పై చర్య తీసుకోవడంతో పాటు వారిని భారతదేశానికి తిరిగి రావడానికి సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరింది.  

ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షులు ఈ విషయమై.. విదేశాలకు వెళ్లే వారు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికోసం APNRTS సక్రమ వలసల పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఎవరూ అక్రమ ఏజెంట్ల చేతిలో మోసపోవద్దని, విదేశాంగ వ్యవహారాల శాఖ (MEA) ద్వారా ఆమోదింపబడిన రిక్రూట్మెంట్ ఏజెంట్ల ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్ళాలని సూచించారు. అలాగే విదేశాలకు వెళ్ళే వారు, విదేశాల్లో ఉన్నవారు ఎవరైనా సరే మీకున్న సందేహాలు, సమస్యలు ఉంటే APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లను 0863 2340678, +91 8500027678 (వాట్సాప్) సంప్రదించగలరని తెలిపారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top