ఆటా సభల్లో మహానేత డా.వైఎస్సార్‌ జయంతి వేడుకలు

17th ATA Convention YSR Jayanthi Celebrations at Washington DC USA - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా)  17వ మహాసభలు అంగరంగ వైభవంగా  ప్రారంభమయ్యాయి. జూలై 1 నుండి 3 తేదీ వరకు వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న 17వ ఆటా కన్వెన్షన్ అండ్‌ యూత్ కాన్ఫరెన్స్‌లో భాగంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి  పెద్దసంఖ్యలో హాజరైన అభిమానులు, నేతలు వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.

ఆ మహానేత సేవలను, స్ఫూర్తిని ఏపీ ఆధికారిక భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రావు గుర్తు చేశారు. ఇంగ్లీష్ మీడియం మీద కొన్ని విపక్షాలు కుట్ర చేస్తున్నాయని యార్లగడ్డ మండిపడ్డారు. ప్రతి పేద వాడి పిల్లలకు ఇంగ్లీష్ చదువులు కావాలని ఎందరో  పాదయాత్రలో  తమ కోరికను వెల్లడించారని చెప్పారు.  అలాగే 98శాతం ఇంగ్లీష్ మీడియం కావాలాని సర్వేలో చెప్పారని తెలిపారు. కేవలం సీఎం జగన్‌కు క్రెడిట్ వస్తుందన్న దుగ్ధతోనే ఇంగ్లీషు మీడియంను తప్పు బట్టారని విమర్శించారు. మీ పిల్లలకు ఇంగ్లీషులు చదువులు కావాలి గానీ, మరి పేదల పిల్లలు ఇంగ్లీషులు చదువుకోవద్దా ? అని  విమర్శిస్తున్నవారినుద్దేశించి ప్రశ్నించారు.

వైఎస్సార్ చిరకాలం అందరి గుండెల్లో నిలిచిపోయారని వైజాగ్ ఎంపీ సత్య నారాయణ  మహానేతకు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ కొడుకుగా  ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు. అమెరికాలో ఏ ముఖ్యమైన తెలుగు కార్యక్రమం జరిగినా వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటారన్నారు.  జులై 8 కంటే ముందే అమెరికాలో జయంతి వేడుకలు జరపడం ఎంతో సంతోషకరమని ఆటా సెక్రెటరీ హరి లింగాల వెల్లడించారు. 

డా. వైఎస్సార్ తన పాలనతో చెరగని ముద్ర వేశారనీ, తన ప్రసంగాలతో అసెంబ్లీకి వన్నె తెచ్చారంటూ నాటా అధ్యక్షుడు రాఘవ రెడ్డి గోసాల వైఎస్సార్‌ సేవలను గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌ను మరిపించేలా జగన్ పాలన దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని ఏపీ ఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు మేడపాటి వెంకట్‌ ప్రశంసించారు. అంతేకాదు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి 175కు 175 సీట్లు గెలిపించాలని పిలుపునిచ్చారు.

పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ మాట్లాడుతూ సామాన్యులకు చేరువైన వ్యక్తి వైఎస్సార్ అనీ, ఆయన మనకు దూరమై 12 ఏళ్లు గడిచినా అందరి మనసుల్లో సజీవంగా నిలిచే ఉన్నారని పేర్కొన్నారు. డా. వైఎస్సార్ చేసిన సంక్షేమంతో ఎంతోమంది ఉన్నత విద్యనభ్యసించి అమెరికా వరకు చేరుకున్నారని అన్నారు.  మహానేత వైఎస్సార్ పాలనను ఆయన తనయుడు జగన్ కొనసాగిస్తున్నారని ఏపీ ప్రభుత్వ  ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్‌ పండుగాయల పేర్కొన్నారు. 

తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ సేవా కార్యక్రమాలు జరిగినా వైఎస్సార్ ఫౌండేషన్ స్పందించి తనవంతు సాయాన్ని అందిస్తుందనీ వైఎస్సార్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి వెల్లడించారు. వైఎస్సార్ ఫౌండేషన్‌కు సంబంధించి అమెరికాలో ఎంతోమంది  తమవంతుగా ముందుకు వచ్చారన్నారు.

మానవత్వం, దార్శనికత కలగలిసిన వ్యక్తి మహా మనిషి వైఎస్సార్, మన మధ్య లేరు అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామంటూ   అమెరికా  వైస్సార్సీపీ  కన్వీనర్ రమేష్ రెడ్డి ఆ మహానేతను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మిమిక్రి రమేష్‌ తన అద్భుతమైన గళంతో వైఎస్సార్‌ను అనుకరించి సభికులను అలరించారు.

 - వాష్టింగ్టన్‌ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top