ఆటా వేడుకలకు వేళాయే

17th ATA Convention will be held in Washington DC from 2022 July 1st to 3rd  - Sakshi

వాషింగ్టన్‌ డీసీ వేదికగా అమెరికన్‌ తెలుగు అసొసియేషన్‌ గ్రాండ్‌ కన్వెన్షన్‌

జులై 1,2,3 తేదీల్లో ఘనంగా జరగనున్న వేడుకలు

అమెరికా చరిత్రలోనే అతి పెద్ద తెలుగు ప్రపంచ మహాసభలు

తెలుగు రాష్ట్రాల నుంచి వందకు పైగా అత్యున్నత ప్రముఖులు

తెలుగు సాంస్కృతిక, కళా వారసత్వం ఉట్టిపడేలా సంబరాలు

దాదాపు 15 వేల మంది వరకు ప్రవాసాంధ్రులు హాజరయ్యే అవకాశం

అమెరికన్‌ తెలుగు అసొసియేషన్‌ కన్వెన్షన్‌ వేడుకలకు అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్‌ ఈ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ముస్తాబవుతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఏ రోజుకారోజు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. అమెరికన్‌ తెలుగు అసొసియేషన్‌ అధ్యక్షుడు భువనేష్‌ భుజాల సారథ్యంలో వేర్వేరు కమిటీలు వేడుకలకు సంబంధించి వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శనల వరకు, అవార్డుల నుంచి హాస్పిటాలిటీ వరకు, స్వాగతాల నుంచి భోజనాల వరకు ఇలా.. చెప్పుకుంటూ పోతే దాదాపు 80 కమిటీలు, 300 మంది వాలంటీర్లు అలుపెరుగకుండా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా మూడు రోజుల్లో వేటికవే వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించారు. ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వందకు పైగా రాజకీయ, సినీ, వ్యాపార, అధికార ప్రముఖులు హాజరు అవుతున్నారు.

గత మూడేళ్లుగా కరోనా పరిస్థితుల వల్ల అమెరికాలో పెద్ద తెలుగు ఈవెంట్‌ ఏదీ జరగలేదు. సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ప్రవాసాంధ్రులు ఇప్పటికే భారీగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.
చారిత్రక వేదిక డిసి కన్వెన్షన్‌ సెంటర్‌
వేడుకలు నిర్వహించనున్న వాషింగ్టన్‌  కన్వెన్షన్‌ సెంటర్‌కు  ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అమెరికా అరు వేర్వేరు అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రెసిడెంట్‌ అభ్యర్థి సమావేశాలకు ఇదే కన్వెన్షన్‌ సెంటర్‌ను ఎంచుకున్నారు...
* 23 లక్షల స్క్వేర్‌ ఫీట్‌ ఏరియా
* అల్ట్రా మోడర్న్‌ స్ట్రక్చర్‌
* 40 వేల మందితో సమావేశాలు నిర్వహించుకునే సదుపాయం
* పూర్తి పర్యావరణ అనుకూలంగా ఉండే గ్లాస్‌ వాల్స్‌
* మూడు ఎయిర్‌పోర్ట్‌లకు సులువుగా చేరుకునే సదుపాయం
* అత్యంత సులువుగా అన్ని రకాల రవాణా సౌకర్యాలు

 
కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రపంచం కోలుకున్న తర్వాత నిర్వహిస్తున్న అతిపెద్ద తెలుగు పండుగ ఇది. ప్రవాసాంధ్రులందరిని ఒక్కతాటిపైకి తెచ్చి ఒక కుటుంబం అన్న భావన తీసుకురావడానికే మా ఈ ప్రయత్నం. ఘనమైన తెలుగు వారసత్వాన్ని అందించడం, పుట్టిన నేలకు తమ వంతు సాయం అందించడం, కొత్త తరానికి స్పూర్తిదాయక సందేశం ఇవ్వడమే ఆటా ముందున్న లక్ష్యాలు. వాషింగ్టన్‌ డీసీలో జులై 1,2,3 తేదీల్లో జరగనున్న వేడుకలకు తరలిరండి!మా ఆతిథ్యాన్ని స్వీకరించండి!! ఆటా కుటుంబంలో భాగం కండి!!! - భువనేష్‌ భుజాల, ఆటా అధ్యక్షుడు
ఎంతో ఘనకీర్తి, ఎన్నో విజయాలు సాధించిన తెలుగు వారికి ఆటా ఒక కేంద్ర బిందువు అవుతుందని భావిస్తున్నాం. వాషింగ్టన్‌ డీసీ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ కన్వెన్షన్‌.. ప్రవాసాంధ్రులందరినీ ఒక్క తాటిపైకి చేర్చబోతుంది. ఎందరో ప్రముఖులు వస్తున్న ఈ కన్వెన్షన్‌ మునుపెన్నడూ లేనంత ఘనంగా నిర్వహించబోతున్నాం. కార్యక్రమాల్లో అత్యున్నత సాంకేతికత, వచ్చిన అతిథులకు అత్యుత్తమ హోటళ్లు, రాకపోకలకు ఆధునాతన రవాణా వసతులు, రుచికరమైన భోజనం, మరిచిపోలేని విధంగా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. హరిప్రసాద్‌ లింగాల, ఆటా సెక్రటరీ

 -వాషింగ్టన్‌ డీసీ  నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top