తెయూ(డిచ్పల్లి): తెయూ మెయిన్ క్యాంపస్ ఓల్డ్ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కొన్ని రోజులుగా హాస్టల్లో తీవ్ర సమస్యలు, ఇబ్బందులు నెలకొన్నాయని విద్యార్థులు పేర్కొన్నారు. శుక్రవారం మెస్‌లో భోజనం బహిష్కరించి తాత్కాలికంగా మెస్‌ను మూసివేసి విద్యార్థులు మెరుపు ధర్నా చేపట్టారు. సరైన వసతులు లేకపోవడం, నిర్వహణ లోపాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టల్లో ఉండటమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది నిర్ణీత హాస్టల్ ఫీజుతో పాటు అదనపు చార్జీలు చెల్లిస్తున్నప్పటికీ, కనీస సౌకర్యాలు కూడా అందడం లేదని విద్యార్థులు వాపోయారు. విషయం తెలుసుకున్న వీసీ యాదగిరిరావు, హాస్టల్స్ చీఫ్ వార్డెన్ రవీందర్‌రెడ్డి హాస్టల్‌కు చేరుకొని విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు తమ ప్రధాన డిమాండ్లను వివరించారు. హాస్టల్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని వీసీ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.


