● సీపీ సాయిచైతన్య
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో నిర్వహించనున్న ఐదో తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్,గేమ్స్ మీట్–2026 ముగింపు కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని సీపీ సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో సీపీ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. క్రీడాపోటీలకు అవసరమైన ట్రాక్‌లను ఏర్పాటు చేసి క్రీడా మైదానాలను తీర్చిదిద్దాలన్నారు. క్రీడాకారులకు వసతి, వైద్య సేవలు, తాగునీటి సరఫరా, భోజనం ఏర్పాటు తదితర అంశాలపై సంబంధిత అధికారులకు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పోలీస్ క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టాలన్నారు. క్రీడా పోటీలు జాన్కంపేట పోలీస్ ట్రైనింగ్ సెంటర్, అలీసాగర్, నాగారం, బైపాస్, కాలూర్ రోడ్డు, ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్, మోపాల్ ఆర్చరీ అకాడమీ ప్రాంతాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, ఏసీపీలు ప్రకాశ్‌యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


