బోధన్: పట్టణంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మదారి శ్రీనివాస్, పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు పల్లవి, చరణి ఉన్నారు. ఆడపిల్లలైనా ఎలాంటి వివక్షత చూపకుండా వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ఉన్నత విద్యను అభ్యసించేలా వెన్నుతట్టి ప్రొత్సహించారు. పెద్ద కూతురు పల్లవి ఎంటెక్ పూర్తి చేసి నాలుగేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కంపెనీలో ఆడిటర్‌గా ఉద్యోగం చేస్తోంది. చిన్న కూతురు చరణి బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. మదారి శ్రీనివాస్ పెంటకలాన్ జడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయుడి (ఎస్‌ఏ)గా పని చేస్తున్నారు. ‘ఆడపిల్లలను ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని మా కూతుళ్లు నిరూపించారు’ అని శ్రీనివాస్ దంపతులు అభిప్రాయం వ్యక్తంచేశారు.


