● కలెక్టర్ భవేశ్ మిశ్రా
● 30వ తేదీ వరకు గడువు విధింపు
నిజామాబాద్ అర్బన్: డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులను ఈ నెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు గడువు విధించారు. నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్, బోధన్, రుద్రూర్, మోర్తాడ్, బాల్కొండలలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన చోట లబ్ధిదారులకు కేటాయింపులు జరుపుతున్నామని, ఇదే తరహాలో మిగతా చోట్ల కూడా ఈ నెలాఖరులోగా కేటాయింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను సమగ్ర పరిశీలన జరపాలని, జాబితా ఆధారంగా డ్రా పద్ధతిన డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలన్నారు. జాబితాలో అనర్హులుంటే వారి పేర్లను తొలగిస్తూ, అనర్హతకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలని, రిజర్వేషన్ల మేరకు కేటాయింపులు జరిగేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, హౌసింగ్ శాఖ ఇన్‌చార్జి పీడీ గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, హౌసింగ్ ఏఈ నివర్తి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


