ఆర్మూర్: తన ఇద్దరు కుమార్తెలను ప్రయోజకులను చేశారు ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్‌కు చెందిన సిరిపురం సాయేందర్ నాగమణి దంపతులు. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని ఉన్నతమైన ల క్ష్యం ముందుకు సాగుతున్నారు కూతుళ్లు. సాయేందర్ ప్రయివేటు ఉద్యోగి. పెద్ద కుమార్తె శ్వేత చదువు మొత్తం ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగింది. ఓ యూలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో రూ.10 లక్షల ప్యాకేజీతో మా రుతీ సుజుకి కంపెనీలో ఉద్యోగం సాధించింది. గేట్‌లో ఆలిండియా 291 ర్యాంక్ సాధించి బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఎంటెక్ రోబొటిక్స్‌లో సీటు సాధించింది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకుంటూ, బెంగళూరులో పీజీ చేస్తూనే 2024లో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్‌గా ఎంపికై ంది. ప్రస్తుతం కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఏఈగా బాధ్యతలు నిర్వహిస్తోంది. సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతోంది. చిన్న కూతురు స్పందన సైతం ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివింది. లాసెట్‌లో రాష్ట్రస్థాయి 21వ ర్యాంక్ సాధించి, ఓయూలో బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసింది. ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా కొనసాగుతూ పీజీ లాసెట్‌లో రాష్ట్రస్థాయి 71వ ర్యాంక్‌ను సాధించి ఓయూ లా కాలేజీలో సీటు పొందింది. జడ్జిగా ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తోంది. ‘ఇద్దరూ కూతుళ్లే అని మమ్మల్ని కొందరు నిరుత్సాహపరిచినప్పటికీ చదువుల్లో ఉన్నతంగా రాణిస్తూ తల్లిదండ్రులుగా మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చారు. కొడుకులు లేరు అన్న భావన తల్లిదండ్రులుగా మాకు ఏ రోజూ రానివ్వకుండా తోటి ఆడపిల్లలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.’ అని సాయేందర్ నాగమణి సంతోషపడుతున్నారు.


