మోపాల్(నిజామాబాద్‌రూరల్): నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని నిగ్వా గ్రామానికి చెందిన జాడె నాందేవ్, మీనాక్షికి నలుగురు కుమార్తెలు. నాందేవ్ రిటైర్డ్ టీచర్. నలుగురు కూతుర్లు అయినప్పటికీ.. ఎలాంటి బేధం లేకుండా అందరినీ ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ఉన్నత విద్యకు ప్రోత్సహించారు. అందులో ఒకరు మోపాల్ ఎస్సై జాడె సుస్మిత. మొదట ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా (ఎస్‌జీటీ) ఎంపికై ంది. జిల్లాలోనే మొదటి ర్యాంక్ రావడంతో సొంత గ్రామంలోనే ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తించారు. అంతటితోనే ఆగిపోలేదు. గ్రూప్–1, 2తోపాటు ఎస్సై ఉద్యోగానికి పరీక్షలు రాశారు. ఎస్సైగా ఎంపికవ్వగా మొదటి పోస్టింగ్ మోపాల్ పోలీస్‌స్టేషన్‌లోనే. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ అక్రమార్కుల ఆటలకు కళ్లెం వేస్తోందనే పేరుంది. కొందరైతే ఏకంగా లేడీ సింగం అని పిలుస్తుంటారు. ‘మాకు నలుగురు కూతుళ్లని ఏనాడూ కుంగిపోలేదు. ఉన్నతంగా చదివించి ప్రయోజకులను చేశాను. ప్రస్తుతం వారికి పేరుప్రతిష్టలు రావడం సంతోషంగా ఉంది’ అని చెబుతున్నారు నాందేవ్.


