●మూడు సార్లు కారులో వచ్చి దొంగతనం
డిచ్‌పల్లి: మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో గురువారం అర్ధరాత్రి దుండగులు తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. డిచ్‌పల్లి ఎస్సై ఎండీ ఆరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఏనుగంటి కోటేశ్వరరావు దంపతులు రెండు నెలల క్రితం కెనడా దేశంలో ఉంటున్న తమ కొడుకు, కోడలు వద్దకు వెళ్లారు. వారికి గ్రామంలోని దేనాబ్యాంక్ వెనక రెండు ఇళ్లు ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుఝామున 5 గంటల లోపు కారులో మూడు సార్లు వచ్చిన ఇద్దరు దుండగులు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ. లక్ష విలువ గల పట్టు చీరలు, విలువైన 8 విదేశీ వాచీలు, 31 తులాల వెండి వస్తువులు, సౌండ్ సిస్టమ్స్ బాక్సులు, ఒక టీవీ ఎత్తుకెళ్లారు. శుక్రవారం తమ మొబైల్ ఫోన్‌లో ఇంట్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించిన వెంకటేశ్వరరావు దంపతులకు ఇంట్లోకి చొరబడిన దుండగులు చోరీకి పాల్పడుతూ కన్పించారు. వెంటనే వారు గ్రామంలోని బంధువులకు ఫోన్‌లో సమాచారం అందించారు. కోటేశ్వరరావు మేనల్లుడు పున్నారావు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


