తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వీడ్కోలు వేడుక శుక్రవారం అంబరాన్నంటిన ఉత్సాహంతో, భావోద్వేగ వాతావరణంలో జరిగింది. వేడుకలకు ముఖ్యఅతిథిగా వర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ హాజరై మాట్లాడారు. జర్నలిజం అనేది సమాజానికి దిశానిర్దేశం చేసే బాధ్యతాయుతమైన వృత్తి అని పేర్కొన్నారు. నిజాయితీ, నిబద్ధత, విలువలు, సామాజిక బాధ్యతతో ముందుకు సాగితే ప్రతి విద్యార్థి తన లక్ష్యాలను తప్పకుండా చేరుకోగలడని సూచించారు. యూనివర్సిటీలో పొందిన జ్ఞానం, అనుభవాలను జీవితాంతం సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. వీడ్కోలు వేడుకలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు అలరించాయి. గడిచిన రెండేళ్ల విద్యా ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలను విద్యార్థులు గుర్తుచేసుకుంటూ తమ అనుభవాలను పంచుకున్నారు. అధ్యాపకులతో, సహచరులతో ఏర్పడిన అనుబంధాన్ని స్మరించుకుంటూ పలువురు భావోద్వేగానికి గురయ్యారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ శాంతబాయి, అధ్యాపకులు మోహన్, శ్రీనివాస్ గౌడ్, జర్నలిజం విద్యార్థులు పాల్గొన్నారు.


