● విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు
● నేడు ఘనంగా జరుపుకోనున్న ప్రజలు
నిజామాబాద్ రూరల్: ఆషాడమాసంలో వచ్చే తొలి ఏకాదశిని మొదటి పండుగగా ప్రజలు జరుపుకుంటారు. దీనినే దేవశయన ఏకాదశి, హరిశయన ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. అలాగే ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఏకదశిని మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజున భక్తులు ఉపవాసం ఉండి, మరుసటి రోజు ద్వాదశిన పారణ చేస్తారు. ఏకాదశి సందర్భంగా జిల్లాలోని వైష్ణవ ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాల్లో భక్తులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మొక్కజొన్న పేలాలను మెత్త టి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం, యాలకులు కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.


