నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు కట్టపై పర్యాటక ప్రాంత కాటేజీ నిర్మాణ పనుల వద్ద నుంచి వెల్డింగ్ మిషన్లను చోరీ చేసిన ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లాకు చెందిన గట్టు రాకేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని లక్ష్మణ్‌రావు కాటేజీల వద్ద కూలీ పనులు చేశారు. అయితే బెట్టింగ్‌లు, మద్యం తాగుడుకు బానిసైన ఇద్దరిని సదరు కాంట్రాక్టర్ పనుల నుంచి తొలగించాడు. ఈ మేరకు ఇద్దరు కలిసి ఈ నెల 4న అర్ధరాత్రి కాటేజీ పనుల వద్దకు చేరుకొని సామగ్రిని భద్రపర్చే గదికి వేసిన తాళాన్ని రాయితో పగుల గొట్టారు. అందులో భద్రపర్చిన రెండు కట్టర్లు, రెండు వెల్డింగ్ మిషన్లు, ఒక బాక్స్‌ను ఎత్తుకు వెళ్లారు. చోరీ విషయమై పనుల వద్ద ఉన్న సూపర్‌వైజర్ మహేశ్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, ఎస్సై శివకుమార్ సాంకేతిక ఆధారంగా విచారణ చేపట్టారు. ఇద్దరు నిందుతులను పట్టుకొని వారి నుంచి మిషన్లు, కారు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందుతులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. చోరీ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ రాజేశ్‌చంద్ర అభినందించారు.


