పని చేసి పరేషాన్‌ | - | Sakshi
Sakshi News home page

పని చేసి పరేషాన్‌

May 16 2026 3:01 AM | Updated on May 16 2026 3:01 AM

బకాయిలు వెంటనే చెల్లించాలి

మోర్తాడ్‌(బాల్కొండ): భీమ్‌గల్‌ మండలంలోని ముచ్కూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ రకాలైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు రూ.15 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తున్నారని నిరసన తెలుపుతూ కొందరు కాంట్రాక్టర్లు పంచాయతీ కార్యాలయానికి ఇటీవల తాళం వేశారు.

మోర్తాడ్‌ మండలం సుంకెట్‌లో గతంలో సర్పంచ్‌గా పని చేసిన కడారి శ్రీనివాస్‌కు రూ.18లక్షల బిల్లు విడుదల కావాల్సి ఉంది. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైనా ఆయనకు బిల్లు మంజూరు చేయలేదు. ఇది ఒక్క ముచ్కూర్‌, సుంకెట్‌ పంచాయతీలలో నెలకొన్న సమస్య కాదు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో పాత బిల్లుల బకాయిలు పేరుకపోయి సంకటంగా మారింది. పంచాయతీలకు సర్పంచ్‌, వార్డు సభ్యులు లేని సమయంలో నిధులు విడుదల కాలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికై న ప్రజాప్రతినిధులు కొలువదీరిన తరువాత బకాయి పడిన నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందులో కొంత భాగమైనా పాత బిల్లుల చెల్లింపులకు కేటాయించాలని గతంలో సర్పంచ్‌లుగా పని చేసిన వారు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. పునర్విభజనకు ముందు జిల్లాలో 535 గ్రామ పంచాయతీలు ఉండగా మెజార్టీ పంచాయతీల్లో పాత బిల్లుల చెల్లింపులు అలాగే ఉన్నాయి. దాదాపు రూ.15 కోట్ల చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ కేవలం రూ.3 కోట్లు అక్కడక్కడ చేశారు. ఇంకా రూ.12 కోట్ల బకాయిలు అలాగే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటాగా స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా నిధులు విడుదల చేయకపోవడంతో పంచాయతీల ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది. 15వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేసే విధానంలో ఎన్నో మార్పులు జరిగాయి. పన్ను ఆదాయం అంతంత మాత్రంగానే ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆశలు పెట్టుకోగా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఫలితంగా పంచాయతీలకు ఆర్థికభారం తప్పడం లేదు.

అధికారుల మౌనం

సంకటంగా మారిన పాత బిల్లులు

15వ ఆర్థిక సంఘం నిధులు

విడుదలైనా చెల్లింపులపై నోరుమెదపని గ్రామ పంచాయతీ పాలకవర్గాలు

జిల్లాలో పేరుకుపోయిన బకాయిలు రూ.12 కోట్లకు పైమాటే..

కొన్ని చోట్ల తక్కువ మొత్తంలో

చెల్లింపులు పూర్తి

పంచాయతీల ద్వారా మాజీ సర్పంచ్‌లకు చెల్లించాల్సిన బిల్లు బకాయిలు వెంటనే చెల్లించాలి. ఏళ్ల తరబడి బిల్లులు చెల్లింపులు సాగక వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి వస్తోంది. అప్పు తీసుకువచ్చి పనులు చేశాం. ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోతే మేము ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం స్పందించి పంచాయతీ బిల్లు బకాయిలు వెంటనే మంజూరు చేయించాలి.

– కడారి శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌, సుంకెట్‌

బిల్లుల బకాయిలకు చెల్లింపుల విషయంలో జిల్లాలోని పంచాయతీ ఉన్నతాధికారులు మౌన వ్రతం పాటిస్తున్నారు. గతంలో చేసిన పనులకు సంబంధించి ఎంబీల రికార్డింగ్‌, పనులకు సంబంధించిన తీర్మాణాలు సక్రమంగా చేసి ఉంటే బిల్లుల చెల్లింపులు తక్షణమే పూర్తి చేయాల్సి ఉంది. అధికారులు మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మౌనం పాటిస్తూ గతంలో సర్పంచ్‌లుగా పని చేసినవారిని ఎలాంటి ప్రయోజనం కల్పించే చర్యలు తీసుకోవడం లేదు. ఉన్నతాధికారులకు చెప్పి పనులు చేసినా బిల్లు బకాయిల విషయంలో పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement