డేంజర్‌ డంపర్లు | - | Sakshi
Sakshi News home page

డేంజర్‌ డంపర్లు

May 15 2026 12:37 PM | Updated on May 15 2026 12:37 PM

నా ప్రాణం కూడా పోయేది..

అధికారులకు పట్టింపు లేదు..

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ నుంచి నల్లమట్టిని తరలిస్తున్న టిప్పర్లు, డంపర్లు యమదూతల్లా దూసుకొస్తున్నాయి. ఎక్కడి నుంచి ఏ టిప్పర్‌ తమపైకి వస్తుందోనని మండల ప్రజలు భయపడుతున్నారు. భారీ వాహనాల అతివేగానికి ప్రాణభయంతో రోడ్లు ఎక్కడానికే జంకుతున్నారు. డొంకేశ్వర్‌ మండలంలోని ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌లో అన్నారం, సిర్పూర్‌ గ్రామాల శివారు ప్రాంతాల్లో నల్లమట్టి తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. పంటల సాగు కోసం ఈ మట్టిని రైతుల పొలాలకు తరలిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా... మట్టిని తరలిస్తున్న టిప్పర్లు, డంపర్లతో పశువులకు, ప్రజలకు, చిన్న పిల్లలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇరుకురోడ్లు కలిగిన గ్రామాల మీదుగా భారీ వాహనాలను నిర్దిష్ట వేగంతో వెళ్లకుండా ఓవర్‌ స్పీడ్‌తో నడుపుతున్నారు. నిబంధనలకు ఉల్లఘించి రాత్రుల్లో కూడా రవాణా చేస్తున్నారు. దీంతో వాహనాల శబ్దం, దుమ్ముతో కాలుష్యం అవుతుతోంది. ఓవర్‌ లోడ్‌తో రోడ్లు ధ్వంసం అవుతున్నారు. రోడ్లకు దగ్గరగా ఆడుకునే చిన్నారులకు ఏం జరుగుతుందోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు.

నిమ్మకు నీరెత్తిన అధికారులు

ఈ నెల 13న సాయంత్రం డొంకేశ్వర్‌ మీదుగా డంపర్లు అతివేగంగా వెళ్లడంతో ప్రమాదాలు జరిగాయి. సాయంత్రం సమయంలో ఒక డంపర్‌ వాహనం పశువులపైకి దూసుకెళ్లింది. ఓ గేదే తీవ్రంగా గాయపడింది. పక్కనే ఉన్న రైతు కండెల రాజన్న త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానిక రైతులు, గ్రామస్తులు టిప్పర్‌ను అడ్డుకొని డ్రైవర్‌ను పట్టుకున్నారు. అంతకు ముందురోజు డంపర్‌ కారణంగా విద్యుత్‌ వైర్‌ తెగిపోయి రోడ్డుపై పడిపోయింది. స్థానికంగా ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అనుభవం లేని వారితో నల్లమట్టి టిప్పర్లు నడిపిస్తున్నారని, కొంతమంది మద్యం సేవించి ఇష్టానుసారంగా తోలుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

సాయంత్రం గేదెలను తీసుకొని ఇంటికి వస్తుండగా వేగంగా వస్తున్న టిప్పర్‌ పశువులపైకి దూసుకొచ్చింది. ఒకదానికి తీవ్రంగా దెబ్బ తగిలి రక్తం కారింది. పక్కనే నేను కూడా ఉన్నా, కొంచెం అయ్యి ఉంటే నా ప్రాణం కూడా పోయేది. నల్లమట్టి టిప్పర్ల మూలంగా రోడ్లపైకి రావాలంటేనే అందరికీ భయంగా ఉంది.

– కండెల రాజన్న, బాధిత రైతు, డొంకేశ్వర్‌

పొలాలకు నల్లమట్టిని రవాణా చేసే విషయంలో రైతులందరం సానుకూలంగానే ఉన్నాం. కానీ, భారీ టిప్పర్లు, డంపర్లను అనుభవం లేని డ్రైవర్లు నడుపుతున్నారు. మద్యం సేవించి అతివేగంతో వెళ్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఏ అధికారి పట్టింపు లేకుండా ఉంటున్నారు.

– గోక గంగారెడ్డి, రైతు, డొంకేశ్వర్‌

మితిమీరిన వేగంతో

వెళ్తున్న నల్లమట్టి టిప్పర్లు

డొంకేశ్వర్‌లో పశువులపైకి

దూసుకెళ్లిన వాహనం

రైతుకు త్రుటిలో తప్పిన ప్రమాదం

మద్యం మత్తులో నడుపుతున్న

అనుభవం లేని డ్రైవర్లు!

చూసీచూడనట్లుగా ఉంటున్న

అధికారులు, పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement