మొక్కజొన్నను గోదాములకు తరలించాలి | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్నను గోదాములకు తరలించాలి

May 15 2026 12:07 PM | Updated on May 15 2026 12:07 PM

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): మొక్కజొన్న రైతులకు ఏ దశలోనూ అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత అధికారులదేనని, సేకరించిన పంట దిగుబడిని గోదాములకు తరలించి భద్రపర్చాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మండలంలోని శ్రీరాంనగర్‌ తండాలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ గురువారం తనిఖీ చేశారు. మొక్కజొన్న నాణ్యత, తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించిన కలెక్టర్‌.. ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మెషన్‌ ద్వారా తూకం సరిగా చేస్తున్నారా..? లేదా? అని గమనించారు. ఎన్ని క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు పూర్తయ్యింది.. ఇంకా ఎంత మేరకు పంట దిగుబడి సేకరించాల్సి ఉందనే వివరాలు అడిగి తెలుసుకుని అధికారులకు సూచనలు చేశారు. అనంతరం శ్రీనగర్‌లోని గోదామును కలెక్టర్‌ సందర్శించారు. మొక్కజొన్న అన్‌ లోడింగ్‌ తీరు, బస్తాలు భద్రపరుస్తున్న విధానాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి బస్తాలను త్వరితగతిన తరలించేందుకు తగినన్ని లారీలు, ఇతర రవాణా వాహనాలు వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు, ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ రేఖానాయక్‌, ఎంపీడీవో రాములునాయక్‌, మార్క్‌ఫెడ్‌ సిబ్బంది భాస్కర్‌, సొసైటీ సీఈవో నర్సయ్య, స్థానిక సిబ్బంది, రైతులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement