మహిళల నైపుణ్యానికి వేదిక!
డొంకేశ్వర్(ఆర్మూర్): స్వయం సహాయ సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల నైపుణ్యాన్ని చాటి చెప్పేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా కేంద్రంలో ‘మినీ సరస్ మేళా’ను నిర్వహిస్తోంది. పాత కలెక్టరేట్ (స్పోర్ట్స్) గ్రౌండ్‌లో నిజామాబా ద్, కామారెడ్డి జిల్లాలకు కలిపి ఈ నెల 6నుంచి 12వ తేదీ వరకు మేళాను నిర్వహించనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా నగర వినియోగదారులకు పరిచయం చేయడం మేళా ప్రధాన ఉద్దేశం. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న మేళాను విజయవంతం చేయడానికి గ్రామీణాభివృద్ధి శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మేళాలో వస్తువులు, ఉత్పత్తులతో ప్రదర్శనకు వచ్చిన ఎస్‌హెచ్‌జీ మహిళలకు వారం రోజులపాటు ఉచితంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నారు.
స్టాళ్లలో విభిన్న ఉత్పత్తులు,
వస్తువుల ప్రదర్శన...
మేళాలో మొత్తం 30 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కేవలం ఎస్‌హెచ్‌జీ మహిళలు తమ చేతులతో తయారు చేసిన చేనేత వస్త్రాలు, జ్యూట్ బ్యాగులు, మట్టి పాత్రలు, గృహ అలంకరణ వస్తువులు, హస్తకళా రూపాలను స్టాళ్ల ద్వారా విక్రయిస్తారు. అలాగే గ్రామీణ వంటకాలు, ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసిన పిండి వంటలు, ఊరగాయలు, మసాలా దినుసులు కూడా ప్రదర్శనలో అమ్మకానికి ఉంచుతారు. ఎస్‌హెచ్‌జీ మహిళలకు వ్యాపార పరిచయం, ఆర్థిక స్వావలంబనకు, కళాకారులకు ప్రోత్సాహానికి ఇదో గొప్ప వేదికని చెప్పొచ్చు. దళారుల ప్రమేయం లేకుండా మహిళలు తమ ఉత్పత్తులకు సరైన ధర పొందేలా ఉపయోగపడుతుంది. విభిన్న వస్తువుల కొనుగోలుకు నగర ప్రజలకు ఈ మేళా మంచి అవకాఽశం కూడా.
మేళాను గొప్పగా నిర్వహిస్తాం
మినీ సరస్ మేళాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో నిర్వహించడం ఇదే మొదటిసారి. మహిళా సంఘాలకు మాత్రమే వా రు తయారు చేసిన వస్తువులు, ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించే అవకాశం ఉంటుంది. ఇది మంచి అవకాశం. ఉత్పత్తులతో పాల్గొనే వారికి నివాస, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నాం. గుర్తుండిపోయేలా మేళాను నిర్వహిస్తాం. నగర ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలి.
– సాయాగౌడ్, డీఆర్డీవో, నిజామాబాద్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ‘మినీ సరస్ మేళా’
ఈ నెల 6న పాత కలెక్టరేట్
గ్రౌండ్‌లో ప్రారంభం
సొంత ఉత్పత్తులు, హస్త కళలను
ప్రదర్శించనున్న ఎస్‌హెచ్‌జీ మహిళలు
విస్తృత ఏర్పాట్లు చేస్తున్న
గ్రామీణాభివృద్ధి శాఖ
మహిళల నైపుణ్యానికి వేదిక!


