కామారెడ్డిలో హైటెన్షన్
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద దగ్ధమవుతున్న కాంరగ్రెస్ నాయకుడి కారు
కామారెడ్డి టౌన్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆరోరా ఇంజనీరింగ్ కళాశాల భూముల వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య కొనసాగిన ‘సవాళ్ల’ పర్వం శనివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిజానిజాలను తేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. ఒక్కడినే వస్తానని, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు సందీప్ ఒక్కడే సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే కే వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. తనతోపాటు తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు ఇవి అని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ రావొద్దని బీజేపీ శ్రేణులకు శుక్రవారమే సూచించారు. దీంతో శనివారం ఉదయం కామారెడ్డి పట్టణంలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్యే కేవీఆర్‌ను క్యాంప్ ఆఫీస్‌ను బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ శ్రేణులు శిశుమందిర్ వద్దకు విడతల వారీగా చేరుకున్నారు. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని అరెస్టులు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు. సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు ఒక్కొక్కరుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. 11గంటల సమయంలో పోసానిపేట మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత గీరెడ్డి మహేందర్‌రెడ్డి కారులో ఒక్కడే నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గేటు ముందుకు చేరుకుని కారు దిగి నినాదాలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహేందర్‌రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. కారును రోడ్డుపై పల్టీలు కొట్టించి పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు ఎగిసిపడడంతో అక్కడ ఉన్న వారందరూ భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పోలీసులు, పక్కనే ఉన్న హాస్టల్‌తోపాటు రోడ్డు పక్కన ఉన్న మురికి కాలువ నుంచి బకెట్లతో నీరు తెచ్చి మంటలను ఆర్పేశారు. ఈ క్రమంలో పలువురు పోలీసులు, బీజేపీ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఏఎస్పీ చైతన్యరెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ముగ్గురిపై కేసు నమోదు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలకు సంబంధించి ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పట్టణ సీఐ నరహరి మాట్లాడుతూ.. అనుమతి లేకుండా క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారన్న బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నాయకుడు గీరెడ్డి మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడి కారును ధ్వంసం చేయడంతోపాటు, పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యవహారంలో మరో ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
ఎమ్మెల్యే కేవీఆర్‌పై భూ అవినీతి
ఆరోపణలు చేసిన కాంగ్రెస్
బహిరంగ చర్చకు తాను
సిద్ధమన్న ఎమ్మెల్యే
ప్రతి సవాళ్లతో శిశుమందిర్‌కు చేరిన
కాంగ్రెస్ శ్రేణులు
క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేను
బయటికి రానీయని పోలీసులు
కాంగ్రెస్ నాయకుడి కారును ధ్వంసం చేసి నిప్పంటించిన బీజేపీ నాయకులు
కామారెడ్డిలో హైటెన్షన్


