బోనస్ నిధులు విడుదల
● రైతుల ఖాతాల్లో
రూ.299.71 కోట్లు జమ
● మరో 39 మందికి పెండింగ్
మోర్తాడ్(బాల్కొండ): వానాకాలం సీజన్‌లో సన్న రకాలను సాగు చేసి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. కొనుగోళ్లు ముగిసిన వెంటనే బోనస్ సొమ్మును చెల్లించాల్సి ఉన్నా నిధుల విడుదలలో జాప్యంతో కాస్తా ఆలస్యంగానే రైతులకు బోనస్ అందింది. ఒక్కో క్వింటాల్‌కు రూ.500 చొప్పున జమ కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నా రు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా 59,96,284 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం విక్రయించారు. అందుకు సంబంధించి బోనస్ సొమ్ము రూ.299,81,42,000 చేరాల్సి ఉండగా ఇప్పటి వరకు 97,002 మంది రైతులకు రూ.299.71 కోట్లు జమయ్యాయి. సుమారు 59,94,200 క్వింటాళ్లకు బోనస్ సొమ్ము చెల్లింపులు పూర్తికాగా, మరో 39 మంది రైతులకు చెందిన 2,084 క్వింటాళ్లకు రూ.10.42 లక్షల బోనస్ డబ్బులు జమ చేయాల్సి ఉంది. ఈ చిన్న మొత్తం నిధులు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ అవుతాయని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.


