అయోమయం.. గందరగోళం
ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల స్వీకరణ ఘట్టం బుధవారం ప్రారంభమైంది. నామినేషన్ పత్రాలను తీసుకున్న ఆశావహులు నిబంధనలు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వర్‌రావు సైతం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆశావహులు ఇక్కట్లు పడ్డారు. కౌన్సిలర్‌గా పోటీచేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలతో జతచేయాల్సిన పత్రాలు, అభ్యర్థితోపాటు అతనిని బలపరిచే ఆ వార్డు ఓటరు పన్నుల నో డ్యూ సర్టిఫికెట్లు, పోలీస్ క్లియరెన్స్, అద్దె ఇంట్లో నివాసం ఉండే అభ్యర్థి సమర్పించాల్సిన పత్రాలు తదితర అంశాలపై స్పష్టత లేకపోవడంతో ఆశావహులు అయోమయానికి గురవుతూ మున్సిపల్ కమిషనర్, రిటర్నింగ్ ఆఫీసర్లను సంప్రదిస్తూ కనిపించారు. మున్సిపల్ కమిషనర్ సైతం మళ్లీ చెప్తాను, తెలుసుకొని చెప్తాను అనే సమాధానాలు చెబుతూ దాటవేయడంతో అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఇంకా రెండ్రోజుల గడువు ఉండటంతో ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో నామినేషన్ పత్రాలు..
ఇప్పటి వరకు నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు ఇంగ్లిష్‌లో ఉండటంతో అభ్యర్థులు వాటిని నింపడానికి ఇబ్బందులు పడేవారు. ఈ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలను తెలుగు భాషలో ప్రచురించడంతో అభ్యర్థులు సులభంగా అర్థం చేసుకొని నింపే పరిస్థితులు నెలకొన్నాయి.
నామినేషన్ నిబంధనలు
తెలియక ఇబ్బందులు
తెలుసుకొని మళ్లీ చెప్తానన్న
మున్సిపల్ కమిషనర్
ఆర్మూర్‌లో నామినేషన్ల స్వీకరణ
కేంద్రానికి, మున్సిపల్ కార్యాలయానికి చక్కర్లు కొట్టిన ఆశావహులు


