ఎన్నికల విధులు పక్కాగా నిర్వహించాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● నామినేషన్ల స్వీకరణ కేంద్రాల పరిశీలన
సుభాష్‌నగర్: ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల విధుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని కంఠేశ్వర్ మున్సిపల్ జోన్ ఆఫీసు, టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, నామినేషన్ ఫారాలు, రిజిస్టర్లను పరిశీలించారు. మొదటిరోజు ఆయా డివిజన్లు, వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన తదితర ప్రక్రియలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దాఖలైన నామినేషన్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలించిన వెంటనే రోజూవారీగా టీ.పోల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. అభ్యర్థులు అన్ని వివరాలతో నామినేషన్ పత్రాలు దాఖలు చేసేలా హెల్ప్‌డెస్క్ ద్వారా అవగాహన కల్పించాలని, వారి సందేహాలు నివృత్తి చేయాలన్నారు. ఎన్నికల సంఘం నియమ, నిబంధనలను పక్కాగా పాటిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని, ఎలాంటి అపోహలు, సందేహాలకు గురికావొద్దని కలెక్టర్ సూచించారు.
కేంద్రాలను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్
మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్ సత్యనారాయణ రెడ్డి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ మున్సిపల్ జోన్ ఆఫీస్, ఫులాంగ్ టీటీడీ కల్యాణ మండపం, గౌతంనగర్, గోల్ హనుమాన్ వాటర్ ట్యాంక్, బడాబజార్ వాటర్ ట్యాంక్ తదితర కేంద్రాలను సందర్శించి, నామినేషన్ల స్వీకరణ తీరును క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఆయన వెంట కమిషనర్ దిలీప్ కుమార్, అధికారులు ఉన్నారు.


