భక్తి శ్రద్ధలతో చక్రతీర్థం
నిజామాబాద్ రూరల్: నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో చక్రతీర్థం నిర్వహించారు. రథోత్సవంలో భాగంగా సోమవారం ఉదయం శివపార్వతుల విగ్రహాలను ఆలయ కోనేరు వరకు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు. అనంతరం ఆలయ మహామండపంలో స్వామివారికి పుష్పయాగం సప్తవర్ణాల సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీరామ్ రవీందర్, ఆలయాభివృద్ధి కమిటీ చైర్మన్ సిరిగిరి తిరుపతి, కమిటీ సభ్యులు నందకిశోర్, డాక్టర్ మదన్మోహన్ రాజు, విజయ రాణి, సిరిగిరి శంకర్, చంద్రకాంత్, ఆలయ అర్చకులు చంద్రశేఖర్, నీలేశ్ కులకర్ణి, శేఖర్, సుహాన్, ఆలయ జూనియర్ అసిస్టెంట్ అమ్మారావు సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
● వైకల్యాన్ని జయించి ఆదర్శంగా
నిలిచిన గోలి శ్రీనివాస్
ఆర్మూర్: వైకల్యాన్ని జయించి దేశ రాజధాని ఢిల్లీలో వైద్య సేవలందిస్తున్నారు వేల్పూర్ మండలం వాడి గ్రామానికి చెందిన గోలి శ్రీనివాస్. అతను చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాడు. కరీంనగర్‌లోని చల్మెడ ఆనంద్‌రావు మెడికల్ కళాశాలలో (2006 బ్యాచ్) మెడిసిన్ పూర్తి చేశారు.2015 యూపీఎస్‌సీ సెలక్షన్స్‌లో సీఎంసీ బ్యాచ్‌కు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) కేడర్ అలాట్ చేశారు.రిపబ్లిక్ డే ఉత్సవాలలో భారత రాష్ట్రపతి, ప్రధాని పాల్గొన్న వేడుకలలో భారత రక్షణ బలగాలు, పోలీసు సిబ్బంది, వివిధ రాష్ట్రాలకు చెందిన పెరేడ్ లో పాల్గొన్న వారికి వైద్య సేవలందించాడు.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ క్యాడర్ అభ్యర్థులకు మూడేళ్లుగా ఫిజికల్ టెస్ట్‌ల్లో కూడా స్వచ్ఛందంగా మెడికల్ సేవలందించాడు. కరోనా సమయంలో సపాయి కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించినందుకు గాను కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆయన వివిధ అవార్డులు అందుకున్నాడు.
రామారెడ్డి: పోలీసుల విధులు ఆటంకం కలిగించిన ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 23న రాత్రి ఇస న్నపల్లి గ్రామ పరిధిలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న మసూరి అనిల్‌కుమార్, భూంపల్లి రాజు పోలీసు సిబ్బందిని అసభ్యపదజాలంతో దూషిస్తూ, తోసివేసే ప్రయత్నం చేశా రు. దీంతో కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్ విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, నిందితులపై గతంలోనూ కేసులున్నాయని తెలిపారు. విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ రామన్ హెచ్చరించారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బంజారతండా వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తుతెలియని కారు సోమవారం రాత్రి ఢీకొట్టింది. బంజారతండాకు చెందిన సాతెల్లి బాల్‌రాజ్ అలియాస్ దావీద్, ఏక్కల్‌దేవి అరవింద్ కుమార్ సోమవారం రాత్రి రోడ్డు దాటే క్రమంలో ఎల్లారెడ్డి వైపు నుంచి గుర్తుతెలియని కారు వచ్చి బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్సై భార్గవ్‌గౌడ్ ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన ఒకరిని తన వాహనంలో, మరొకరిని ఆటోలో గోపాల్‌పేటలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో మెదక్ ఆస్పత్రికి తరలించారు.
భక్తి శ్రద్ధలతో చక్రతీర్థం


