క్రైం కార్నర్
అదృశ్యమైన వ్యక్తి మృతి
● అడవిలో మృతదేహం లభ్యం
రుద్రూర్: అదృశ్యమైన వ్యక్తి మృతదేహం అటవీ ప్రాంతంలో లభ్యమైంది. కోటగిరి ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోటగిరి మండలం దేవునిగుట్ట తండాకు చెందిన హలావత్ రాంసింగ్ (58) ఈ నెల 18 నుంచి కనిపించడం లేదు. దీంతో కుటుంబసభ్యులు ఈ నెల 22న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోమవారం కొత్తపల్లి గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో రాంసింగ్ మృతదేహం లభ్యమైంది. చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
కారు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి ..
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామశివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు సోమవారం తెలిపారు. ఆదివారం రాత్రి జాతీయ రహదారి దాటుతుండగా కారు ఢీ కొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని కామారెడ్డి మార్చురీలో ఉంచామని, వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు సీఐ 8712686153, ఎస్సై 8712686154 లకు సమాచారం అందించాలన్నారు.
క్రైం కార్నర్


