కరంటోళ్ల ‘ప్రజాబాట’
చిన్న సమస్యలకు సత్వర పరిష్కారం
రెంజల్: క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు టీజీఎన్పీడీసీఎల్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రైతులకు సంబంధించి వ్యవసాయ విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు పొలంబాట నిర్వహిస్తున్న ట్రాన్స్‌కో అధికారులు, ప్రస్తుతం గృహ సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రజాబాట చేపట్టారు. ఈ నెల 6వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రజాబాట నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో గ్రామస్థాయిలో ప్రజాబాట నిర్వహించి స్థానిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయ, గృహ అవసరాల విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించేందుకు వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆధునిక సాంకేతికను వినియోగించి వినియోగదారులకు నిరంతరం మెరుగైన కరెంట్‌ను అందించేందుకు ముందుకు సాగుతున్నారు. పొలంబాట ద్వారా నేరుగా రైతుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అదే తరహాలో క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాబాట పడుతున్నారు. ప్రాధాన్య క్రమంలో గుర్తించిన సమస్యలను విడతల వారీగా పరిష్కరించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. సెక్షన్ స్థాయిలో ఎస్‌ఈ, డీఈ, ఏడీఈ, ఏఈల సమక్షంలో నిర్వహించే ప్రజాబాటలో ఆయా స్థాయి అధికారులు మూడు రోజులు మూడు గ్రామాల్లో పాల్గొనేలా టీజీఎన్పీడీసీఎల్ ఆదేశాలను జారీ చేసింది.
ప్రజాబాట ద్వారా గ్రామాల్లోని చిన్న, చిన్న సమస్యలను సిబ్బంది సత్వరం పరిష్కరిస్తారు. పెద్ద సమస్య ఉంటే నిబంధనల ప్రకారం అంచనాలు రూపొందించి పరిష్కరిస్తాం. విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు పొలంబాట, ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, డిచ్‌పల్లి డివిజన్‌లలో సుమారు 50 వరకు సెక్షన్‌లు ఉన్నాయి. ప్రతి వారం ఆయా డివిజన్‌లలో మూడు రోజులపాటు ప్రజాబాట ఉంటుంది. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి.
– ఎండీ ముక్తార్, డీఈ, బోధన్
క్షేత్రస్థాయిలో ట్రాన్స్‌కో
అధికారుల పర్యటన
ప్రతి సెక్షన్‌లో వారానికి
మూడు రోజులు
కొత్త కార్యక్రమానికి
టీజీఎన్పీడీసీఎల్ కార్యాచరణ
మంగళ, గురు, శనివారాల్లో నిర్వహణ


