ఐయామ్ యమా.. వేర్ ఈజ్ హెల్మెట్
● హెల్మెట్ ధారణపై వినూత్న పద్ధతిలో పోలీసుల అవగాహన
మోర్తాడ్: ‘ఓ ద్విచక్ర వాహనదారుడా..! తలకు హె ల్మెట్ ధరిస్తే ప్రశాంతంగా ఇంటికి వెళ్తావు. లేదంటే మా దగ్గరికి రావాల్సి ఉంటుంది.’ అంటూ యమధర్మరాజు, యమభటుల వేషధారణతో పోలీసు శాఖ కళాకారులు అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను పాటించకపోతే జరిమానాలను వసూలు చేయడం ఎంత ముఖ్యమో, ఆ నిబంధనలను పాటించేలా చైతన్యం తీసుకరావడం అంతే ముఖ్యమని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వివిధ స్టేషన్‌ల ఆధ్వర్యంలో వాహనదారులకు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో జరిగే అనర్థాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు.
ప్రత్యేకంగా షార్ట్ ఫిల్మ్...
హెల్మెట్ వినియోగంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్ 5 నిమిషాల నిడివిగల షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించగా సీపీ సాయి చైతన్య ఆవిష్కరించారు. ఈ షార్ట్ ఫిల్మ్ సామాజిక మాధ్యమాలలో ట్రోలింగ్ అవుతూనే ఉంది. హెల్మెట్ ఆవశ్యకతను వివరిస్తూ పోలీసులు చేపడుతున్న చైతన్య కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని ప్రజలు అభినందిస్తున్నారు.


