‘రాజీకి రమ్మని ఒత్తిడి చేస్తున్నారు’
పాకాలలో గంగాధర్‌తో మాట్లాడుతున్న ఎంపీడీవో తదితరులు
సిరికొండ: పాకాల గ్రామంలో నెలకొన్న సమస్యలపై జాతీయ గిరిజన కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై రాజీకి రమ్మని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని గ్రామానికి చెందిన బాణావత్ గంగాధర్ తెలిపారు. పాకాల గ్రామంలో 50 ఏళ్లుగా సరైన మౌలిక వసతులు కల్పించక పోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేక గ్రామస్తులు ఆస్పత్రికి వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులపై తాను గిరిజన కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు గంగాధర్ తెలిపారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని, సమస్య పరిష్కారమైనట్లు సంతకం చేయాలని ఎంపీడీవో మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి తనను ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బాకారం రవి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చందర్ నాయక్ తహసీల్దార్ రవీందర్‌రావు తదితరులను గ్రామానికి తీసుకొచ్చి ఫిర్యాదుపై విత్‌డ్రా కావాలని ఒత్తిడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకుండా తనను మానసికంగా క్షోభ పెట్టడం సరికాదని, జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గంగాధర్ విజ్ఞప్తి చేశారు.


