శభాష్ పోలీస్
● నీటమునిగిన వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్
నిజాంసాగర్(జుక్కల్): మాఘమ అమావాస్య స్నానానికి వచ్చి నాగమడుగులో నీటమునిగిన ఒకరిని పోలీస్ కానిస్టేబుల్ సాహసం చేసి కాపాడాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బిచ్కుందకు చెందిన మల్లేశ్ కుటుంబీకులతో కలిసి ఆదివారం నిజాంసాగర్ మండలం నాగమడుగు నీటిలో స్నానానికి వచ్చాడు. మంజీర నది తీరాన ఉన్న బండరాళ్లపై నుంచి ప్రమాదవశాత్తు కాలుజారీ నీటమునిగాడు. ఒడ్డున ఉన్న కుటుంబీకులు కాపాడాలని ఆర్తనాదాలు చేయడంతో అక్కడే విధుల్లో ఉన్న శ్యాం కానిస్టేబుల్ నాగమడుగులోకి దూకాడు. నీటమునుగుతున్న మల్లేశ్‌ను ఒడ్డుకు తీసుకువచ్చాడు. అప్పటికే మల్లేశ్ నీరు మింగడంతో స్థానికులు, పోలీసులు సపర్యలు చేసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకరి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శ్యాంను భక్తులు, స్థానికులు అభినందించారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ఇందల్వాయి: మండలంలోని లింగాపూర్ వాగు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న పాటి తండాకి చెందిన రెండు ట్రాక్టర్లను శనివారం అర్ధరాత్రి పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఇసుక తరలింపునకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు.


