
వేగవంతంగా ‘డబుల్ ఇళ్ల’ కేటాయింపు ప్రక్రియ
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులకు కేటాయించే ప్రక్రియ వేగవంతం చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖల అధికారులు గురువారం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వారు స్థానికంగా నెలకొని ఉన్న స్థితిగతులను కలెక్టరేట్‌లో ఆయనకు వివరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా అర్హులను గుర్తించి ఆమోదం నిమిత్తం జిల్లా ఇన్‌చార్జి మంత్రికి లబ్ధిదారుల జాబితా పంపుతామని అన్నారు. ప్రధానంగా ఇల్లు, నివాస స్థలం లేని నిరుపేద కుటుంబాలు, సఫాయి కర్మచారీలు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇళ్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పవన్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఆర్‌అండ్‌బీ డీఈ రంజిత్, హౌసింగ్ అధికారి నివర్తి తదితరులు ఉన్నారు.