నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

Published Thu, Apr 18 2024 9:35 AM

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్‌ - Sakshi

నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం నుంచే నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్‌, సీపీలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 25 తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపారు. 26న నామినేషన్ల స్క్రూటినీ, 29న మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణకు చివరి గడువు అని పేర్కొన్నారు. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌ ఉంటుందని చెప్పారు. నామినేషన్లను కలెక్టర్‌ చాంబర్‌లో స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సెలవు దినాలు మినహా.. మిగతా పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తామని వివరించారు. నామినేషన్‌ దాఖలు చేసే జనరల్‌ అభ్యర్థులు రూ. 25వేలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన వారైతే రూ. 12,500లను సెక్యూరిటీ డిపాజిట్‌ రూపంలో జమ చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు అకౌంట్‌ తెరవాలన్నారు. దీని ద్వారానే ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీలు నిర్వహిస్తూ పక్కాగా రికార్డులు నిర్వహించాలన్నారు.

నియోజకవర్గంలో 17,01,573 మంది ఓటర్లు

పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం 17,01,573 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్‌ తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు కోసం దాఖలైన దరఖాస్తులను ఈ నెల 25 వరకు పరిశీలించి జాబితాలో అర్హులైన వారి పేర్లను చేర్చడం జరుగుతుందన్నారు. దీంతో పోలింగ్‌ నాటికి ఓటర్ల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉంటుందన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలతో పాటు, ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు మొత్తం 22 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ. 33,04,837 నగదుతో పాటు రూ. 28,00,000 విలువ చేసే ఆభరణాలు ఇతర వస్తువులను సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలో ఎంసీసీ, సర్వేలెన్స్‌ బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, వీడియో సర్వేలెన్స్‌ బందాలను, ఎంసీఎంసీ కమిటీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేసి నోడల్‌ అధికారులను నియమించామన్నారు. పోలింగ్‌ సిబ్బంది నియామకం పూర్తయ్యిందని చెప్పారు.

కలెక్టరేట్‌ వద్ద 144 సెక్షన్‌

నిబంధనలు తప్పక పాటించాలి

కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు,

పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌

నామినేషన్ల దాఖలు సందర్భంగా నిర్వహించే ర్యాలీలకు ముందస్తుగానే దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని సీపీ కల్మేశ్వర్‌ తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో 144 సెక్ష న్‌ అమలులో ఉంటుందన్నారు. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థి వెంట మరో నలుగురిని మాత్రమే లోనికి అనుతిస్తామన్నారు. మిగతా వారికి కలెక్టరేట్‌ మెయిన్‌ గేట్‌ నుంచి 200 మీటర్ల దూరం వరకే అనుమతి ఉంటుందన్నారు. ఎన్నికలను పురస్కరించుకుని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సుమారు 1,900 మంది పాత నేరస్తులను బైండోవర్‌ చేశామని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అంకిత్‌, ఆర్మూర్‌ ఆర్డీవో రాజాగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement