మోర్తాడ్: ఇరాన్‌తో సాగుతున్న యుద్ధాన్ని సాకుగా చూపుతున్న వ్యాపారులు ఎర్రజొన్నల ధరను అమాంతం తగ్గించారు. తమ లాభాలకు వ్యాపారులు గండికొడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సీజన్‌లో జిల్లాలో 22,378 ఎకరాల్లో ఎర్రజొన్నలను సాగు చేశారు. మూడు సీజన్‌లతో పోల్చితే సాగు విస్తీర్ణం ఎంతో తగ్గింది. సాగు విస్తీర్ణం తగ్గిపోయిన కారణంగా ఉన్న పంటకు డిమాండ్ ఏర్పడాల్సి ఉంది. కానీ వ్యాపారుల మాయాజాలంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి ఏటా ఏదో ఒక కారణం చెబుతూ ఎర్రజొన్నలకు ధర తగ్గిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. ఈసారి ఏకంగా ఇరాన్ యుద్ధాన్ని సాకుగా చూపడం గమనార్హం. ఎర్రజొన్నలను అత్యధికంగా ఉత్తరాది రాష్ట్రాల్లోనే వినియోగిస్తారు. కొంత మొత్తం మాత్రం పొరుగు దేశాలకు ఎగుమతి అవుతుంది. వ్యాపారులు కావాలని ధర తగ్గించి తమను నష్టానికి గురి చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు.
మోర్తాడ్ మండలం దొన్కల్‌కు చెందిన రైతు రవి పండించిన ఎర్రజొన్నలను క్వింటాలుకు రూ.3,900ల ధరకు విక్రయించాలని నిర్ణయించాడు. వ్యాపారులు మాత్రం రూ.600లు తగ్గించి ఒక్కో క్వింటాలుకు రూ.3,300 మాత్రమే చెల్లిస్తామని స్పష్టం చేశారు. దీంతో సదరు రైతు అనుకున్న ధరకు ఎర్రజొన్నలను విక్రయిస్తే రూ.6,35,700ల ఆదాయం లభించేది. వ్యాపారులు సూచించిన ధరకు అమ్మితే రూ.5,37,900ల ఆదాయం మాత్రమే వచ్చేది. అంటే ఆ రైతుకు రూ.97,800ల నష్టం వాటిల్లుతుంది. ఇప్పట్లో ఎర్రజొన్నలను విక్రయించడానికి బదులు కోల్డ్ స్టోరేజీలో నిలువ చేసుకుని ధర పెరిగిన సమయంలోనే అమ్ముకోవాలని రైతు రవి నిర్ణయించాడు. ఇది ఒక్క రవి భావనే కాదు. ఎర్రజొన్నలను సాగు చేసిన ఎంతో మంది రైతులు ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారు. అందుబాటులో ఉంటే కోల్డ్ స్టోరేజీలు లేకుంటే గోదాంలు, తమ ఇళ్లలోనే ఎర్రజొన్నలను నిలువ చేసుకుంటున్నారు.
యుద్ధం కారణం చూపి
ధర తగ్గించిన వ్యాపారులు
వారం రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.600 పడిపోయిన ధర
ధర పెరిగాకే
విక్రయిస్తామంటున్న రైతులు


