వర్ని: మండలంలోని శంకోర గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తు పడిన కృష్ణ జింకను గ్రామస్తులు ఆదివారం కాపాడారు. అడవిలో కుక్కలు వెంటపడగా వాటి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో సాగర్ కాలువలో పడిన కృష్ణ జింకను శంకోరా గ్రామానికి చెందిన యువకులు కాపాడారు. నీళ్లలో కొట్టుకపోతున్న జింకను పైకి తీసుకొచ్చి మళ్లీ అడవిలో వదిలివేశారు.
కామారెడ్డి టౌన్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత సామాన్యులతో పాటు చిన్న చిన్న హోటళ్ల నిర్వాహకులను సైతం ఇబ్బంది పెడుతోంది. గ్యాస్ సిలిండర్ లభించకపోవడంతో జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆర్కేలాడ్డ్ రోడ్‌లో ఒక చిన్న ఫుడ్ హోటల్ నిర్వాహకురాలు వినూత్నంగా ఆలోచించారు. వంట గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఆధునిక కట్టెల పొయ్యిని వినియోగిస్తూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అతి తక్కువ కట్టెలు లేదా బొగ్గుతో, ఎక్కువ వేడినిచ్చే ఈ పొయ్యిని వాడటం వల్ల ఖర్చు గణనీయంగా తగ్గుతోందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా రొట్టెలు, వంటకాలు చేయడానికి గ్యాస్ స్టౌ కంటే ఇలాంటి పొయ్యిలే ఎంతో అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఒకవైపు కమర్షియల్ గ్యాస్ దొరక్కపోవడంతో ఇలాంటి తక్కువ ఖర్చుతో కూడిన మార్గాలను అన్వేషించడం ఇప్పుడు జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది.


