Nizamabad: Revanth Reddy Will Likely Contestant From Armoor, News Viral - Sakshi
Sakshi News home page

ఆర్మూర్‌ బరిలో రేవంత్‌!

Jul 7 2023 10:00 AM | Updated on Jul 7 2023 1:11 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : తెలంగాణ ఇచ్చినప్పటికీ పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలనే లక్ష్యంతో సర్వశక్తులూ ఒడ్డుతోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పూర్తి స్థాయిలో సది్వనియోగం చేసుకుని వ్యూహాత్మకంగా ఎత్తులు వేసేందుకు పావులు కదుపుతోంది. జిల్లాల వారీగా పార్టీ బలం, బలహీనతల లెక్కలు వేసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్టీ బలంగా ఉండడంతో పాటు ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక, అదేవిధంగా మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు తదితరులు చేరనుండడంతో పార్టీ శ్రేణుల్లో తిరుగులేని ఉత్సాహం పెల్లుబికుతోంది.

దక్షిణ తెలంగాణ విషయమై పార్టీ అధినాయకత్వం పూర్తి భరోసాతో ఉంది. ఖమ్మం సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పార్టీ పూరించింది. తదుపరి టాస్‌్కలో భాగంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై నాయకత్వం ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా బలహీనంగా ఉన్న నిజామాబాద్‌ జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని బరిలోకి దించేందుకు ఏఐసీసీ నాయకులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 

సోషల్‌ మీడియాలో వైరల్‌.. 
రేవంత్‌ ఆర్మూర్‌ నుంచి పోటీ చేస్తారనే విషయమై జిల్లాలోని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా ఆర్మూర్‌ డివిజన్‌లో పసుపు రైతులు, ఇతర రైతుల గ్రూపుల్లో ఈ అంశం తిరుగుతోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ నేపథ్యంలో రైతుల్లో పారీ్టపై అనుకూలత పెరిగింది. ధరణి రద్దు చేస్తామని ప్రకటనతో కాంగ్రెస్‌కు మరింత మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో రైతుల్లోకి మరింతగా చొచ్చుకెళ్లేందుకు వ్యవసాయపరంగా ముందంజలో ఉన్న ఆర్మూర్‌ నుంచి రేవంత్‌ను పోటీ చేయించనున్నట్లు పార్టీ వర్గాలు వెళ్లడిస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలపై ప్రభావం కోసమే..!
కర్ణాటక విజయం తరువాత తెలంగాణను చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం ఇక్కడి వ్యవహారాలను నేరుగా పర్యవేక్షిస్తోంది. దక్షిణ తెలంగాణలో అత్యంత ప్రభావం చూపించే నాయకులు ఉండడంతో ఉత్తర తెలంగాణలో సైతం ఆ స్థాయిలో ప్రభావం చూపించే విధంగా పావులు కదుపుతోంది. పైగా ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావం ఉండడంతో పకడ్బందీగా వ్యవహరించేందుకు అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో తిరుగులేని ప్రజాదరణ ఉన్న రేవంత్‌రెడ్డిని ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దించేందుకు ఏఐసీసీ నాయకులు సూచించినట్లు తెలిసింది.

ఇందుకు సంబంధించి ఇప్పటికే సునీల్‌ కనుగోలు సర్వే బృందం వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. రేవంత్‌ ఆర్మూర్‌ నుంచి బరిలో ఉంటే ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంగనర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ని 25 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి మరింత ఆదరణ వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో నిజామాబాద్‌ డీసీసీ నాయకత్వం రేవంత్‌ను బాల్కొండ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ప్రతిపాదించినప్పటికీ ఆ దిశగా వ్యవహారం ముందుకు పడలేదు.

ఎన్నికలు సమీపిస్తున్న దశలో ఉత్తర తెలంగాణపై ఫోకస్‌ పెట్టిన ఏఐసీసీ నేతలు ఆర్మూర్‌ నుంచి రేవంత్‌ను బరిలో దించేందుకు ఆలోచిస్తుండడం విశేషం. ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇక్కడ రేవంత్‌ విజయం నల్లేరు మీద నడకేనని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement