వృద్ధురాలిపై దుండగుల దాడి
● బంగారు గొలుసు అపహరణ
రుద్రూర్: కోటగిరిలోని వినాయక నగర్‌లో వృద్ధురాలిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి బంగారు పుస్తెల తాడు అపహరించారు. ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు ఇలా.. వినాయక్ నగర్‌కు చెందిన ఎముల లింగవ్వ (65) తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. బుధవారం రాత్రి ఆరుబయటకు వచ్చిన సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి ఇంటి గోడ దూకి లోపలికి ప్రవేశించారు. అనంతరం వృద్ధురాలి ముఖాన్ని గుడ్డతో మూసి, ఆమైపె దాడి చేసి మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన లింగవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
నిందితుడి రిమాండ్
గాంధారి(ఎల్లారెడ్డి): పరారీలో ఉన్న నాటుసారా నిందితుడు లకావత్ రామును గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా.. మండల పరిధిలోని రాంలక్ష్మణ్‌పల్లి తండాలో నాటు సారా తయారు చేసి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఈ నెల మూడో తేదీన దాడి చేసి లకావత్ రాము ఇంటిలో దాడి చేయగా, నాల్గు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు రాము అప్పటి నుంచి పరారీలో ఉన్నాడన్నారు. గురువారం అరెస్టు చేసిన రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నాటు సారా తయారు చేసినా, విక్రయించినా కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తామని ఎస్సై హెచ్చరించారు.


