మందమర్రి పట్టణంలోని కుంజు వినోద్‌కుమార్ పదో తరగతి తర్వాత ఐటీఐ(వెల్డర్) చదివాడు. వెల్డింగ్ పనులను వృత్తిగా ఎంచుకున్నాడు. 2015 జూలై 23న పట్టణంలోని రామన్‌కాలనీలో వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. పై అంతస్తులో ఉన్న పైపును కిందికి తీసుకునే క్రమంలో భవనం పక్కనున్న 11కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. విద్యుత్ షాక్ తగలడంతో రెండు చేతులూ కోల్పోయాడు. రెండు చేతులు మోచేయి వరకు కోల్పోయినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. చేతులకు కృత్రిమ చేయి అమర్చుకుని వెల్డింగ్ వృత్తితో జీవనం సాగిస్తున్నాడు. చేయందించే వారు లేరంటూ కొందరు బద్దకిస్తుండగా.. చేతులు లేకపోయినా స్వయం ఉపాధి పొందుతూ భార్య, ఇద్దరు పిల్లలను పోషిస్తున్న వినోద్‌కుమార్ ఆదర్శనంగా నిలుస్తున్నాడు. ప్రభుత్వం దుకాణం ఏర్పాటుకు ఆర్థికసాయం అందించాలని కోరుతున్నాడు. – మందమర్రిరూరల్
ఉదయపు సూర్యకాంతి రోడ్డు మీద పడగానే అశ్వినిగణేశ్ దినచర్య మొదలవుతుంది. ఇద్దరు పసిబిడ్డలను వదిలి వెళ్లలేని పరిస్థితి.. మరోవైపు జీవనం కోసం సంపాదించాల్సిన అనివార్యత. ఈ రెండింటి మధ్య సతమతం కాకుండా బతుకు బండి నడిపిస్తోంది. ఇద్దరు పిల్లలను వాహనంలోనే కూర్చోబెట్టుకుని, ఒక చేతితో స్టీరింగ్ తిప్పుతూ కష్టాల కడలిని దాటుతోంది. అశ్వినిగణేశ్ నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్, రవినగర్, గొల్లపేట్, రెడ్డి కాలనీ, దివ్యనగర్ తదితర వాడల్లో ఇల్లిల్లూ తిరుగుతూ చెత్త సేకరిస్తోంది. మున్సిపల్ కాంట్రాక్టర్ వాహనం ఇవ్వగా.. చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. సమాజంలో ఎంతోమంది తమ కష్టాలను తలుచుకుని నిరాశ చెందుతుంటారు. కానీ ఏ పరిస్థితుల్లోనూ పిల్లలను దూరం పెట్టకుండా, వారిని తన కంటిపాపలా చూసుకుంటూనే కష్టపడుతోంది. ముఖంలో చెరగని చిరునవ్వుతో పెనుభారాన్ని మోస్తోంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
కూరగాయలు విక్రయిస్తున్న రామచంద్రయ్య
కూరగాయలు మోసుకొస్తున్న చిన్నన్న
నేటి యువతలో కొందరు చిన్నపాటి పనులు చేయడానికి వెనుకంజ వేస్తారు. ఉద్యోగం
రాలేదని నిరాశ చెందుతారు. కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామానికి చెందిన వృద్ధ రైతులు వయస్సు పైబడినా అలుపెరుగక బతుక నడక సాగిస్తున్నారు. కష్టాన్నే పెట్టుబడిగా మార్చుకుని జీవిస్తున్నారు. జజ్జరవెల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు కొట్రంగి రామచంద్రయ్య, చిన్నన్న సుమారు 74 ఏళ్లు పైబడిన వయస్సులోనూ స్వతహాగా వ్యవసాయం చేస్తున్నారు. స్వయంగా పండించిన కూరగాయలు మూటగట్టుకుని నెత్తిన పెట్టుకుని నడుస్తూ ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని నెన్నెలకు ఉదయాన్నే చేరుకుంటారు. వీధుల్లో తిరిగి కూరగాయలు విక్రయించడం దినచర్యగా మారింది. బెల్లంపల్లి మార్కెట్, ఇతర గ్రామాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. 50 ఏళ్లుగా కూరగాయలు విక్రయించి జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. – నెన్నెల
అలుపెరుగని అడుగులు
ఆత్మస్థైర్యమే పై‘చేయి’..!


